ఎల్లారెడ్డి , డిసెంబర్ 24, (తెలంగాణ ఎక్స్ ప్రెస్):
లోకరక్షకుడు ఏసు క్రీస్తు చేసిన బోధనలు మానవాళికి అనుసరణీయం అని, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్నారు. మంగళవారం పట్టణంలోని స్థానిక వి కె వి ఫంక్షన్ హాల్లో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటుచేసిన ముందస్తు క్రిస్మస్ విందు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. ముందుగా ఫాస్టార్లు ఎమ్మెల్యేను గజమాలతో సత్కరించారు. పిదప ఫాస్టర్లలతో కలిసి ఎమ్మెల్యే కేక్ కట్ చేసి క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ… ప్రేమ శాంతి ఐక్యతల సందేశమే క్రిస్మస్ అని అన్నారు. క్రిస్మస్ పండుగను క్రైస్తవులు సంతోషంగా జరుపుకోవాలని ఆయన కోరారు. ఏసుక్రీస్తు ఈ లోకం లోని ప్రజలందరికీ ప్రేమ ఆప్యాయతను నేర్పించారని ఎదుటివారిని ప్రేమించే గుణం మనలో ఉండాలని ప్రతి ఒక్కరు పరమత సహనం పాటించాలన్నారు. సమాజంలో శాంతిని పెంపొందించి అందరికీ పంచేందుకు జన్మించిన పవిత్రమూర్తి ఏసుక్రీస్తు జననం మానవాళికి ఒక స్ఫూర్తిదాయకమని ఆయన చూపించిన మార్గంలో నడవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ పండుగను అధికారికంగా నిర్వహించడం సంతోషకరమన్నారు. అసెంబ్లీ సమావేశంలో నియోజకవర్గ పేద ప్రజల గురించి ప్రస్తావిస్తానని ప్రజలకు కావాల్సింది కూడు, గూడు, గుడ్డ అని అన్నారు. ఎల్లారెడ్డి నుంచి కామారెడ్డి వరకు ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఎంతోమంది చనిపోతున్నారని, రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి దృష్టికి తాను తీసుకెళ్లడంతో మంత్రి సానుకూలంగా స్పందించి ప్రమాదకరమైన రోడ్డు మలుపుల వద్ద సూచిక బోర్డలకు 50 లక్షల రూపాయలు నిధులను మంజూరు చేయడం జరిగిందని చెప్పారు. అదేవిధంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పేద ప్రజలకు ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య చికిత్సల కోసం అత్యధికంగా ఎల్ఓసి నిధులు అందజేయడం జరిగిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు స్థానిక ఆర్డీఓ మన్నె ప్రభాకర్, డీఎస్పీ ఏ. శ్రీనివాసులు, ఏ ఎం సి ఛైర్ పర్సన్ రజిత వెంకట్ రాంరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కురుమ సాయిబాబా, మాజీ జడ్పీటీసీలు ఉషా గౌడ్, సామెల్, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నాగం గోపీ కృష్ణ, గాంధారి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బండారి పరమేష్, సిఎస్ఐ చర్చ్ ప్రెస్బైటర్ ఇంచార్జి రెవరెండ్ ఎర్రోళ్ల ప్రభాకర్, రేవ జోసెఫ్, మాణిక్యం, ఎదవర్షిప్ కేంద్రం నిర్వాహకులు బ్రదర్ శ్రీనివాస్ చారి, సిస్టర్ హెబ్సిబా చారి, భాస్కర్, విజయ్ కుమార్, రాజదాస్, నియోజకవర్గంలోని వివిధ మండలాల పాస్టర్లు , తదితరులు పాల్గొన్నారు.

