రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి శ్రీ వాకిటి శ్రీహరి ముదిరాజ్ గారిపై ఇటీవల బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో గంగపుత్ర చైతన్య సమితి ప్రతినిధులు చేసిన ఆరోపణలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని సమన్వయ కమిటీ సభ్యులు డాక్టర్ చొప్పరి శంకర్ ముదిరాజ్, గొడుగు శ్రీనివాస్ ముదిరాజ్, గుండ్లపల్లి శ్రీను ముదిరాజులు తెలిపారు.
హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న మంత్రిని వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని "కుల గజ్జి మంత్రి" వంటి అవమానకర పదజాలంతో దూషించడం ప్రజాస్వామ్య విలువలకు, రాజ్యాంగ స్ఫూర్తికి, సామాజిక సామరస్యానికి విరుద్ధమని పేర్కొన్నారు. దీనికి వారు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
విభేదాలు ఉంటే అవి వాస్తవాలు, చట్టాలు, ప్రభుత్వ జీవోలు, న్యాయస్థానాల తీర్పులు, అధికారిక ఆధారాల ఆధారంగా వ్యక్తం చేయాలని, కుల విద్వేషాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఏ విధంగానూ సమర్థనీయం కావని అన్నారు. ముదిరాజులు కూడా సంప్రదాయ మత్స్యకార వర్గమేనని ప్రభుత్వ రికార్డులు, కమిషన్ నివేదికలు, చట్టాలు స్పష్టం చేస్తున్నాయని, దానిని వారి వ్యక్తిగత అంశంగా తీసుకుంటున్నారని తెలిపారు. అనంతరామన్ కమిషన్ నివేదికతో పాటు పలు ప్రభుత్వ జీవోలు కూడా ఈ విషయాన్ని గుర్తించాయని చెప్పారు.
1827లో, అంటే 199 ఏళ్ల కిందట మొదటిసారి మత్స్య చట్టం వచ్చిందని, అందులో ఎక్కడా ఈ కులం చేపలు పడుతుంది అని లేదని తెలిపారు. జనాభా పెరుగుదలతో ముదిరాజ్ సమాజంలోని ప్రతి ఒక్కరూ మత్స్య వృత్తిలో లేకపోయినా, ఆ సంప్రదాయ వృత్తితో ఉన్న చారిత్రక అనుబంధాన్ని ఎవరూ తిరస్కరించలేరని, కాబట్టి ముదిరాజ్ మత్స్యకారులను మత్స్యకారులు కాదని చెప్పడం లక్షలాది కుటుంబాలను అవమానించడమేనని అన్నారు.
మంత్రి వాకిటి శ్రీహరి ముదిరాజ్ గారు రాష్ట్రంలోని అన్ని మత్స్యకార వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తున్నారని, బీమా, చేపపిల్లల పంపిణీ, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాల్లో నిత్యం పరిశీలిస్తూ ఉంటారని, దానిని వక్రీకరించడం ప్రజాస్వామ్య విధానం కాదని పేర్కొన్నారు. ప్రతి సమస్యకు ఒక వ్యక్తిని లేదా ఒక సామాజిక వర్గాన్ని బాధ్యులుగా చూపించడం సమంజసం కాదని అన్నారు.
చేపపిల్లల పంపిణీలో జరిగిన అక్రమాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా విజిలెన్స్ విచారణకు ఆదేశించారని, విచారణ కొనసాగుతున్న సమయంలో మత్స్యశాఖ కార్యాలయంలో అధికారిక పదవిలో ఉండి ఏం జరిగిందో అందరికీ తెలుసునని అన్నారు. వాస్తవాలు వెలుగులోకి రాకముందే అధికారిక పదవి అనుభవిస్తూ దానిని పక్కదోవ పట్టించి విజిలెన్స్ వారికి ఇచ్చిన లేఖలు భద్రంగా ఉన్నాయని, అసలు విషయం పక్కన పెట్టి ఆరోపణలు చేయడం బాధ్యతారాహిత్యమని విమర్శించారు. అంతేకాక, ఆరోపణలకు సంబంధించిన కాలంలో శ్రీ వాకిటి శ్రీహరి ముదిరాజ్ గారు మత్స్యశాఖ మంత్రిగా కూడా లేరని గుర్తుంచుకోవాలని సూచించారు.
కోహెడ చేపల ఎక్స్పోర్ట్ మార్కెట్ శిలాఫలకం అంశాన్ని కూడా అనవసరంగా కుల వివాదంగా మార్చే ప్రయత్నం జరిగిందని, ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణ, ప్రోటోకాల్, శిలాఫలకానికి సంబంధించిన అంశాలు జిల్లా యంత్రాంగం, సంబంధిత జిల్లా మంత్రి, ఇన్చార్జ్ మంత్రి, స్థానిక ప్రజాప్రతినిధుల పరిధిలో ఉంటాయని, వాటన్నింటికీ ఒక్క మత్స్యశాఖ మంత్రినే బాధ్యుడిగా చూపడం వాస్తవాలకు విరుద్ధమని పేర్కొన్నారు.





