జడ్చర్ల మండలం లింగంపేట గ్రామానికి చెందిన తిరుపతయ్య అండర్-19 మహబూబ్‌నగర్ జిల్లా క్రికెట్ జట్టుకు ఎంపికయ్యారు. ఈ ఎంపిక గ్రామస్థులకు గర్వకారణంగా నిలిచింది.
క్రికెట్‌పై ఆసక్తి, క్రమశిక్షణతో సొంత గ్రామంలోనే సాధన చేస్తూ ప్రతిభను చాటుకున్న తిరుపతయ్య, గ్రామ, మండల స్థాయి ఎంపికల అనంతరం జిల్లా జట్టులో స్థానం సంపాదించారు. అతని ప్రతిభను గుర్తించిన జిల్లా క్రికెట్ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
తిరుపతయ్య ఎంపిక పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయనను గ్రామ పెద్దలు, యువకులు, క్రీడాభిమానులు ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో రాష్ట్ర, జాతీయ స్థాయిలో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
గ్రామంలోని యువ క్రీడాకారులకు తిరుపతయ్య ఎంపిక స్ఫూర్తిగా నిలిచిందని పలువురు పేర్కొన్నారు. ఈ సన్మాన కార్యక్రమంలో గ్రామ పెద్దలు, క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.




