ఎల్లారెడ్డి, జులై 26,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికుల డిమాండ్లను పరిష్కరించే విధంగా సిఎం కేసీఆర్ మనసు మారాలని కోరుతూ, బుధవారం ఎల్లారెడ్డి అంబేద్కర్ చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహానికి గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికులు వినతి పత్రం అందజేశారు. తమ డిమాండ్ల సాధన కోసం చేస్తున్న సమ్మెలో బాగంగా 21 వ రోజు స్థానిక తెలంగాణ తల్లి ప్రాంగణం నుంచి ఉద్యోగ కార్మికులు ర్యాలీగా అంబేద్కర్ చౌరస్తా వరకు చేరుకుని అక్కడ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము కరోన కష్ట కాలంలో ప్రాణాలకు సైతం పణంగా పెట్టి విధులు నిర్వహించిన తమ సేవలను ప్రభుత్వం గుర్తించి తమకు రెగ్యులర్ చేసి, ఉద్యోగ భద్రత కల్పించాలని, 11 వ పిఆర్సి నిర్ణయించిన మినిమం బేసిక్ 19,000 వేలు, అలోపు జీఓ 60 ప్రకారం గ్రామ పంచాయతీ సిబ్బందికి కేటగిరీల వారీగా 15,600 నుంచి కనీస వేతనాలు 19,500 రూపాయలు చెల్లించాలని, జీఓ 51 ను సవరించి మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తమ న్యాయ మైన డిమాండ్లను నెరవేర్చే విధంగా సిఎం కేసీఆర్ మనసు మార్చాలని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ద్వారా కోరినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కారోబార్లు కృష్ణమూర్తి, ఖాజా పాష, రాజశేఖర్, సంజీవులు, సంగమేశ్వర్ రెడ్డి, సఫాయిలు కాశీరాం, సక్రియ, వాటర్ మెన్ లు నటానియల్, శివరాములు తదితరులు పాల్గొన్నారు.