మెదక్, జూలై 26
సమాజ సేవ ద్వారా జర్నలిజానికి మరింత గౌరవం లభిస్తుందని ఎన్ యూ జే (ఐ) జాతీయ ఉపాధ్యక్షులు ఉక్కల్కర్ రాజేందర్ నాథ్ అన్నారు. తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ (టీజేఏ) 12వ ఫౌండేషన్ డే వేడుకలు ఆదివారం మెదక్ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాలసదన్, ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
సమాజ సేవతోనే జర్నలిజానికి మరింత గౌరవం పెరుగుతుందని ఎన్ యూ జే (ఐ) జాతీయ ఉపాధ్యక్షులు ఉక్కల్కర్ రాజేందర్ నాథ్ అన్నారు. తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ (టీజేఏ) 12వ ఫౌండేషన్ డే వేడుకలు ఆదివారం మెదక్ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా టీజేఏ అధ్యక్షుడు ఉమా మహేశ్వర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఎన్యూజే(ఐ) జాతీయ ఉపాధ్యక్షుడు ఉక్కల్కర్ రాజేందర్ నాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
కార్యక్రమంలో భాగంగా ముందుగా మెదక్ బాలసదన్లోని చిన్నారులకు పండ్లు పంపిణీ చేసి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు పంపిణీ చేస్తూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. జర్నలిస్టులు సమాజానికి వార్తలు అందించడమే కాకుండా సామాజిక బాధ్యతలను కూడా నిర్వర్తించాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
అనంతరం ఎన్జీఓ భవన్లో నిర్వహించిన సమావేశంలో జర్నలిస్టుల సంక్షేమం, సంస్థ బలోపేతం, సభ్యత్వ నమోదు, వృత్తి పరిరక్షణ వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా ఎన్యూజే(ఐ) జాతీయ ఉపాధ్యక్షుడు ఉక్కల్కర్ రాజేందర్ నాథ్ మాట్లాడుతూ, జర్నలిజం అనేది ప్రజాస్వామ్యానికి నాలుగో స్థంభమని, జర్నలిస్టుల ఐక్యతే వారి బలమని అన్నారు. మారుతున్న పరిస్థితుల్లో జర్నలిస్టులు వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవడంతో పాటు సంఘటితంగా ఉంటేనే సంక్షేమం, హక్కుల సాధన సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రతి జర్నలిస్టు టీజేఏ సభ్యత్వం తీసుకుని సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
ఎన్యూజే కార్యవర్గ సభ్యుడు దన్నరపు రాజలింగం మాట్లాడుతూ, జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి సంఘం నిరంతరం పోరాడుతోందని, వృత్తి గౌరవం కాపాడేందుకు ప్రతి సభ్యుడు సంఘ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని కోరారు.
టీజేఏ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు చింతల నీలకంఠం మాట్లాడుతూ, జర్నలిజం విలువలను కాపాడుకోవడం నేటి తరానికి ఎంతో అవసరమని, నిజాయితీతో కూడిన వార్తా కథనాలే సమాజానికి మార్గదర్శకమవుతాయని అన్నారు.
కామారెడ్డి జిల్లా టీజేఏ అధ్యక్షుడు సడక్ సునీల్ మాట్లాడుతూ, జిల్లాల స్థాయిలో జర్నలిస్టుల ఐక్యతను మరింత బలోపేతం చేసి, యువ జర్నలిస్టులను సంఘంలో భాగస్వాములను చేయాల్సిన అవసరం ఉందన్నారు.
మెదక్ జిల్లా టీజేఏ అధ్యక్షుడు ఉమా మహేశ్వర్ మాట్లాడుతూ, జిల్లాలో టీజేఏను మరింత బలోపేతం చేసేందుకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపడుతున్నామని తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం సంఘం నిరంతరం కృషి చేస్తుందని చెప్పారు.








