ఎల్లారెడ్డి, జులై 19,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం జేఎసి నీ చర్చలకు పిలవాలని , జిల్లా గ్రామ పంచాయతీ కార్మికుల సంఘాల ఛైర్మన్ వెంకట్ గౌడ్ డిమాండ్ చేశారు. బుధవారం గ్రామపంచాయతీ కార్మిక సంఘాల జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు నియోజవర్గ కేంద్రాల్లో ర్యాలీ,ధర్నా నిర్వహించారు. ఇందులో భాగంగా ఎల్లారెడ్డి తహశీల్దార్ కార్యాలయం నుండి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వరకు ర్యాలీగా చేరుకుని అక్కడ ధర్నా నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే జాజాల సురేందర్ ప్రభుత్వ పిఏకు డిమాండ్ లతో కూడిన వినతి పత్రం అందజేసి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళ్లాలని కోరారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ కార్మిక సంఘాల జేఏసీ చైర్మన్ వెంకట్ గౌడ్ మాట్లాడుతూ ఈ రోజుకు గ్రామపంచాయతీ కార్మికుల రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె 14 రోజులకు చేరిందని, కానీ ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం పట్టించు కోకుండా రాష్ట్ర పంచాయతీ శాఖమంత్రి ఎర్రబెల్లి సమ్మె విరమించాలని కోరడం కాదని, జెఏసి ని చర్చలకు పిలిచి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రోజు కూలీ 700 రూపాయలు ఖర్చు చేసి కొందరు పనులు చేయించుకునే ప్రయత్నం చేస్తున్నారు, అవే డబ్బులు 30 సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులకు ఇవ్వాలని అన్నారు. వెంటనే రాష్ట్ర సిఎం కేసీఆర్ స్పందించి గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారోత్సవాల్లో భాగంగా ఒకరోజు గ్రామ పంచాయతీ కార్మికులకు సన్మానం చేసారు తప్ప వాళ్ళ జీతాలు పెంచలేదని, శాలువా కప్పుతే కడుపు నిండదని జీతాలు పెంచాలని అన్నారు. గ్రామ పంచాయతీ కార్మికులు కరోనా సమయంలో ప్రాణాలను లెక్క చేయకుండా ప్రజలకు సేవ చేశారని వారి సేవలను గుర్తించకుండా రాష్ట్ర ప్రభుత్వం కపట ప్రేమ నటిస్తున్నదని అన్నారు. వెంటనే గ్రామ పంచాయతీ కార్మికులను రెగ్యులర్ చేసి వారికి కనీస వేతనాలు అమలు చేయాలని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా చైర్మన్ వెంకట్ గౌడ్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి మోతిరాం నాయక్, కారోబార్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రభాకర్, మండల నాయకులు, బాలయ్య, అజమ్, నర్సింలు, బాలమణి, అంజమ్మ, రాజు, సాయిలు, కృష్ణ మూర్తి, తదితరులు పాల్గొన్నారు.