ఎల్లారెడ్డి, మార్చి 7,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
ఎల్లారెడ్డి పట్టణంలోని స్థానిక నీలకంటేశ్వరాలయం శివరాత్రి వేడుకలకు ముస్తాబైంది. ఆలయం పూజారి పెద్ద సంగప్ప, వీర సంగప్ప, ఈశ్వ రప్పలు ఆలయ గోడలపై గత సంవత్సరం హైద్రాబాద్ లో నివసిస్తున్న ప్రముఖ పెంటర్, సీనియర్ జర్నలిస్ట్, సూర్య దిన పత్రిక సబ్ ఎడిటర్ బ్యూరో చీఫ్ గా విధులు నిర్వహిస్తున్న విద్య వెంకట్ ను పెద్ద సంగప్ప కుమారుడు వార్డు కౌన్సిలర్ నీలకంఠం పిలిపించి సుందరంగా జ్యోతిర్లింగ చిత్రాలను సుందరంగా వేయించడంతో నీలకంటేశ్వరాలయం కొత్త అందాలు సంతరించుకుని పూర్వవైభవం ఉట్టి పడేలా చేయడంతో ప్రత్యేక ఆకర్షణగా ముస్తాబైంది. శుక్రవారం శివరాత్రి పర్వదినం పురస్కరించుకుని ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ, 11.25 కు బిందర్ నుండి ఆలయం వరకు స్వామి వారి ఊరేగింపు, పల్లకి సేవ, 12.45 కు అభిజిత్ లగ్న పుష్కరంశమున పార్వతి పరమేశ్వరుల సామూహిక కళ్యాణ మహోత్సవం ఉంటుందని, సాయంత్రం 6 గంటలకు సహస్ర దీపారాధన, రాత్రి 12 గంటలకు లింగోద్భవ మహారుధ్రాభిషేకం, డో లాహరణం, మరుసటి రోజు శనివారం ఉదయం 6.45 కు అగ్ని గుండాల కార్యక్రమం, 12.25 కు అన్నప్రసాదం, సాయంత్రం 4 గంటలకు ఎడ్ల బండ్ల ప్రదర్శన ఉంటుందని ఆలయ పూజారి వీర సంగప్ప తెలిపారు. ఈ సారి ఆలయం ముందు భాగంలో ప్రత్యేకంగా రేకుల షెడ్డును ఏర్పాటు చేయడం జరిగింది. భక్తుల సౌకర్యార్థం ఆలయం ఆవరణలో షామియానాలు, బారికెడ్లను ఏర్పాటు చేసినట్లు పూజారి తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై తీర్థ ప్రసాదాలు స్వీకరించి, మహాశివుని ఆశీర్వాదం పొందాలని ఆలయ పూజారులు కోరారు.