తెలంగాణ ఎక్స్ప్రెస్14. మహబూబ్నగర్:-
మంచి విద్య తోటే పిల్లల భవిష్యత్తు అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం మహబూబ్ నగర్ నియోజకవర్గం లోని సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్ మరియు కళాశాల లో నూతన డైట్ మెనూ ను ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 15 సంవత్సరాలుగా ఒకే రకమైన మెనూ ఉండేదని, కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గా అయిన తరువాత 40% అధికంగా డైట్ చార్జీలు పెంచడం జరిగిందని ఆయన తెలిపారు. గత 10 సంవత్సరాలుగా బిఆర్ఎస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థ ను నిర్లక్ష్యం చేశారని ఆయన మండిపడ్డారు. ప్రధానంగా పిల్లల భవిష్యత్తు కోసం ఏఏ కార్యక్రమాలు చేయాలో నిర్ణయించుకొని, ముఖ్యమంత్రి నుంచి ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు, మండల అధికారులు సైతం ఈరోజు శ్రమిస్తున్నారని ఆయన అన్నారు. పిల్లల భవిష్యత్తు కోసం మన జిల్లా లోనే ఇంజనీరింగ్, మెడికల్, వెటర్నరీ, లా కళాశాల లు పెంచడం జరిగిందని, తల్లిదండ్రుల మీద భారం పడకుండా మా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి పాఠశాలలో కళాశాలలో అభివృద్ధి చేస్తున్నామని ఆయన ఉద్ఘాటించారు. తల్లిదండ్రులకు పిల్లల భవిష్యత్తు కంటే ముఖ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. ప్రజా ప్రభుత్వం విద్యా వ్యవస్థ లో మంచి మార్పులకు శ్రీకారం చుట్టుతుందని, అందులో భాగంగానే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, మంచి ఆహారం అందించడం, ఉపాధ్యాయుల కొరత లేకుండా 11 వేల మంది ఉపాధ్యాయులను నియమించడం చేశామని , చదువుతో పాటుగా విద్యార్థుల్లో దాగిన నైపుణ్యాలను వెలికి తీసేందుకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామని ఆయన స్పష్టం చేశారు. రెసిడెన్షియల్ స్కూల్స్, హాస్టల్స్, స్కూల్స్ లను మేము అధికారులు సందర్శించి వసతులు ఏర్పాటుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు. విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే మంచిగా చదువుకోవాలని, మీ అందరి దృష్టి అంతా కూడా చదువు పైన కేంద్రీకరించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి అని ఆయన ఆకాంక్షించారు. మన ముఖ్యమంత్రి మన జిల్లాకు అనేక పెద్ద పెద్ద పరిశ్రమలు తీసుకురావడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఒక్క సంవత్సరం లోనే మన మహబూబ్ నగర్ జిల్లా లోని కొడంగల్ లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్ కళాశాల, మెడికల్ కాలేజీ, దేవరకద్ర లో డిగ్రీ కళాశాల, జడ్చర్ల లో, దేవరకద్ర లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, మహబూబ్ నగర్ లో లా కళాశాల , ఇంజనీరింగ్ కళాశాల, డిగ్రీ కళాశాల తెచ్చామని ఆయన స్పష్టం చేశారు. మీ తల్లిదండ్రులు ఎంతో శ్రమకోర్చి మిమ్మల్ని ఇక్కడ చదివిస్తున్నారని, వారి శ్రమ త్యాగం వృధా కాకుండా మీరు మంచి స్థాయిలో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.ఈ సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అతిథులను అలరించాయి. అనంతరం విద్యార్థులతో కలిసి ఆయన భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ వాణిశ్రీ, మహబూబ్ నగర్ గ్రామీణ తహసీల్దార్ సుందర్ రాజ్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, , రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ లయన్ నటరాజ్, సిఐ అప్పయ్య, కౌన్సిలర్ ఖాజా పాషా, శ్రీనివాస్ యాదవ్ మరియు విద్యార్థులు, తల్లితండ్రులు , అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.


