శేరిలింగంపల్లి, జనవరి 30(తెలంగాణ ఎక్సప్రెస్ న్యూస్ ):
అమర వీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం మాదాపూర్ లోని స్వాతి హైస్కూల్ ఆవరణలో గల గాంధీ విగ్రహానికి ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. తదనంతరం కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ మాట్లాడుతూ ‘ షహీద్ దివస్’ లేదా ‘అమర్ షహీద్ దివస్’ అని కూడా పిలువబడే అమరవీరుల సంస్మరణ దినోత్సవమని అన్నారు. 1948 జనవరి 30న జాతిపిత మహాత్మా గాంధీ హత్య గావించబడిన రోజు. వారి బలిదానానికి జ్ఞాపకంగా ప్రతి సంవత్సరం జనవరి 30న అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. మహాత్మా గాంధీ అహింసా, సత్యం సిద్ధాంతాలతో దేశ స్వాతంత్ర్యము కోసం కృషి చేసిన అగ్రగణ్యులలో ఒకరు. అలానే దేశ స్వాతంత్ర్య సంగ్రామ పోరాటంలో పాల్గొని అమరవీరులైన అందరి గౌరవార్ధం వారిని స్మరించుకునేందుకు దేశం యావత్తు ఈ కార్యక్రమం నిర్వహించు కుంటుంది” అని అన్నారు. “ఈ కార్యక్రమం అమరవీరుల చారిత్రక వారసత్వాన్ని పరిరక్షించడం కోసం, భావి తరాలకు స్ఫూర్తి దాయకంగా నిలవడానికి, జాతీయ ఐక్యతను బలోపేతం చేయడంకోసం పౌరులకు గుర్తు చేస్తుంది” అని అన్నారు. ఈ సందర్భంగా అమరవీరుల గౌరవార్ధం రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్ వి.ఫణికుమార్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కొత్తపల్లి కోటేశ్వరరావు, పాలం శ్రీను, చంద్రిక, బాలాజీ, అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.