-ఒక్క కూపన్ కి 4 నుండి 5 ట్రిప్పులు ఇసుక తోలకాలు
-అధికారులు పట్టించుకోవడం లేదంటూ స్థానికుల ఆవేదన
-చర్యలు తీసుకుంటామంటున్న తాహాసిల్దార్
బోనకల్, ఫిబ్రవరి 21 (తెలంగాణ ఎక్స్ప్రెస్):మండల పరిధిలోని రాయన్నపెట ఇసుక రేవు నుంచి రోజుకు పదుల సంఖ్యలో ఎటువంటి అనుమతులు లేకుండా ట్రాక్టర్ల ద్వారా అదే గ్రామానికీ చెందిన కొంతమంది ఇసుక మాఫియా ముఠా గుట్టు చప్పుడు కాకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు.గతవారం రోజులుగా ట్రాక్టర్ల ద్వారా జోరుగా ఇసుక రవాణా జరుగుతున్నా రెవెన్యూ,పోలీసు అధికారులు మాత్రం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు తెలుపుతున్నారు. స్థానిక పంచాయతీ కార్యదర్శి, రెవెన్యూ నుంచీ ఒకరీని పెట్టినట్లు అధికారులు చెప్తున్న మండల కేంద్రంలో నుంచి అక్రమ ఇసుక రాత్రి పగలు తేడా లేకుండా ఒక్క కూపన్ నుంచి 4 నుండి 5 ట్రిప్పుల ఇసుకను బయట వ్యక్తులకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారనీ స్థానికులు చర్చించుకుంటున్నారు.

అక్రమార్కులు నిత్యం ఇసుకను తరలించడంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడడమే కాకుండా ప్రభుత్వం త్వరలో ప్రారంభించనున్న ఇందిరమ్మ గృహాల నిర్మాణానికి ఇసుక కొరత ఏర్పడనుందని మండల ప్రజలు వాపోతున్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ ఇసుక రవాణా కు అడ్డు కట్ట వేస్తారో లేదో వేచి చూడాల్సిందే?
తాహాసిల్దార్ వివరణ:
అనుమతులు లేకుండా అక్రమ ఇసుక రవాణా చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తహశీల్దర్ అనిశెట్టి పున్నం చందర్ తెలిపారు.ఒక కూపున్ కు ఒక టిప్పు ఇసుకకు మాత్రమే అనుమతి ఉందనీ,కూపన్ లో ఉన్న సమయంలోనే తోలకాలు జరపాలని అన్నారు.ఇదే విషయమై పోలీసు అధికారులతో కూడ చర్చించినట్లు తెలిపారు.