గ్రామాలలో మొదలైన భక్తుల సందడి…
వీణవంక, ఫిబ్రవరి 14( తెలంగాణ ఎక్స్ ప్రెస్ ప్రతినిధి).
కరీంనగర్ జిల్లా వీణవంక మండల పరిధిలోని నిన్న 26 గ్రామాలలో సమ్మక్క- సారలమ్మ దేవతలకు ఎత్తు బెల్లాలను ఇవ్వడం మొదలయ్యింది. రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే , అంతర్జాతీయ జానపద, వనదేవతల, వన జాతరకు గ్రామాలలో గత రెండు వారాలుగా సందడి వాతావరణం నెలకొంటుంది. గ్రామాలలో సమ్మక్క – సార్లమ్మల భక్తి పరవశంతో భక్తులు నూతన వస్తువులు ధరించి, ఎత్తు బెల్లాలను తీసుకొచ్చి,గొర్రెపోతు, మేకపోతు, కోడి పిల్ల, యాటలతో, బెల్లం శక, తాటికల్లు, బ్రాండ్ విస్కీలతో ఆరగిస్తూ, కోరిన కోరికలను తీర్చే, వనదేవతల నమస్కరిస్తూ, బంధువుల మధ్య మొక్కు చెల్లిస్తూ, ఇంటిల్లిపాది ఆనందంగా గడపడం అనాదిగా వస్తున్న ఆచారం. ఈ ఆచారాన్ని కరీంనగర్, వరంగల్ జిల్లాలలోని గ్రామ గ్రామాన వనదేవతల పండుగలను, మాఘ మాస పౌర్ణమి కి మూడు రోజులు ముందుగా అంగరంగ వైభవంగా జరుపుకోగా, స్వయంభుగా వెలసిన వనదేవతల ఇలవేల్పు అయిన మేడారంలో ఇసుక వేస్తే, రాలని జనంతో అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా, భక్తి పారవశంతో, అద్భుత ఆవిష్కరణలతో, ప్రకృతి అందాల నడుమ, కోయ పూజారుల తో కమనీయమైన, మనోహరమైన హరివిల్లుల నడుమ , జానపదుల నృత్యాలు నడుమ, శివసత్తుల పూనకాలతో సమ్మక్క- సారలమ్మ ఆగమనంతో మేడారం భక్తులతో దద్దరిల్లుతుంది. అలాగే మన మండలంలోని వీణవంక, చల్లూరు, పోతిరెడ్డిపల్లి, గ్రామాలలో సమ్మక్క- సారలమ్మ జాతర కన్నుల పండుగ గా జరిగే ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి.
