Home తాజా వార్తలు హామీ ఇచ్చేటప్పుడు ‘బోనస్-భరోసా’ గుర్తుకు రాలేదా?-ఫిరోజ్ ఖాన్, సీనియర్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, 9640466464

హామీ ఇచ్చేటప్పుడు ‘బోనస్-భరోసా’ గుర్తుకు రాలేదా?-ఫిరోజ్ ఖాన్, సీనియర్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, 9640466464

by Telangana Express

తెలంగాణ ఎక్స్ ప్రెస్ అదిలాబాద్ డిసెంబర్ 13

‘రైతు భరోసా, రుణమాఫీ కంటే బోనస్ తోనే ఎంతో మేలు..’ ఢిల్లీలో మీడియా చిట్ చాట్ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కామెంట్లివీ.. ‘రైతు భరోసా కంటే బోనస్ ఎంతో బాగుంది. రైతులకు దేనితో ఎక్కువ మేలు జరిగితే దాన్నే అమలు చేస్తాం’ అంతకు ముందు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు చేసిన వ్యాఖ్యలివి. డిప్యూటీ మంత్రులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా రైతుల్లో ఒక విధమైన గందరగోళం నెలకొన్నది. బోనస్ అమలు చేస్తే రైతు భరోసా ఇవ్వరని, రైతు భరోసా ఇస్తే బోనస్ అమలు చేయరనే అనుమానం వ్యక్తమవుతున్నది. ఈ నేపథ్యంలో సంక్రాంతి నుంచి రైతు భరోసా ఇస్తామని, బోనస్ ను కొనసాగిస్తామని సీఎం, మంత్రులు క్లారిటీ ఇచ్చినా.. ఇప్పుడు రైతుల్లో ఒక రకమైన అనుమానం నెలకొన్నది.

హామీ ఇచ్చేటప్పుడు అంచనా వేయలేదా?
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను ప్రకటించింది. ‘రైతు భరోసా’ పేరుతో ప్రకటించిన గ్యారంటీలో రైతులకు, కౌలు రైతులకు ఏడాదికి రూ. 15వేల పెట్టుబడి సాయం అందజేస్తామని హామీ ఇచ్చింది. రైతు కూలీలకు ఏడాదికి రూ. 12వేలు ఇస్తామని పేర్కొన్నది. ఆ హామీలోనే వరికి రూ. 500 బోనస్ ఇస్తామని వెల్లడించింది. ఒకే గ్యారంటీలో రైతుభరోసా, వరికి బోనస్ హామీ ఇచ్చిన కాంగ్రెస్ నేతలు.. ఇప్పుడు కొత్తపల్లవి అందుకోవడంపై రైతుల నుంచి విస్మయం వ్యక్తమవుతున్నది. రైతులకు ఏది మంచిదో పరిశీలించి అమలు చేస్తామని అప్పుడెందుకు చెప్పలేదనే ప్రశ్న రైతుల నుంచి ఎదురవుతున్నది.

చెప్పిందొకటి.. చేస్తున్నదొకటి..
రైతుల విషయంలో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ చెప్పిందొకటి.. అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్నదొకటి అనే అభిప్రాయం రైతుల నుంచి వినిపిస్తున్నది. రైతుబంధు పేరుతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏడాదికి ఎకరానికి రూ. 10వేల సాయాన్ని అందజేసింది. అయితే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ సాయాన్ని రూ. 15వేలకు పెంచుతామని చెప్పింది. అధికారంలోకి వచ్చాక ఒక సీజన్ కు సంబంధించి ఎకరానికి రూ. 5వేల సాయాన్ని అందజేసింది. ఆ తర్వాత స్కీమ్ లో అవకతవకలు, అక్రమాలు అనే పేరు చెప్పి మరో సీజన్ కు సంబంధించి సాయాన్ని అందజేయలేదు. కొంతమేర రుణమాఫీ చేసినా పెట్టుబడి సాయం విషయంలో రైతుల నుంచి వ్యతిరేకత వస్తున్నదనే విషయాన్ని గ్రహించిన ప్రభుత్వం ఆ తర్వాత సంక్రాంతి నుంచి రైతు భరోసా ను అమలు చేస్తామని చెబుతున్నది. అయితే విధి విధానాలు, నిబంధనలు, ఎన్ని ఎకరాల వరకు ఇస్తారనే విషయంలో గందరగోళం నెలకొన్నది. విధివిధానాలపై ప్రభుత్వ ప్రకటన వచ్చిన తర్వాతే దీనిపై స్పష్టత రానున్నది.

సన్నాలకు మాత్రమే బోనస్..
రైతు భరోసా గ్యారంటీలోనే కాంగ్రెస్ వరికి రూ. 500 బోనస్ ఇస్తామని ప్రకటించింది. ఆ అధికారంలోకి వచ్చాక కేవలం సన్నాలకు మాత్రమే బోనస్ ఇస్తామని చెప్పింది. సన్నాలను ప్రోత్సహించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. దీంతో దొడ్డు రకం సాగు చేసే రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో సన్నరకం పండించే రైతులు కొద్దిమంది మాత్రమే ఉంటారు. వానాకాలంలో 30-35 శాతం, యాసంగిలో 10-15 శాతం మంది రైతులు మాత్రమే సన్నాలను సాగు చేస్తారు. దీంతో దొడ్డు రకం వడ్లను సాగు చేసే 70-80 శాతం రైతులు బోనస్ ను నష్టపోవాల్సి వస్తున్నది. అసలు సన్నాల కంటే దొడ్డు రకానికే బోనస్ ఎక్కువ అవసరమనే అభిప్రాయమున్నది.

రుణమాఫీలోనూ అన్యాయమే!
ఏకకాలంలో రూ. 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక రుణమాఫీ కోసం రూ. 30వేల కోట్లు అవసరమవుతాయి అంచనావేసింది. సీఎం నుంచి మంత్రుల వరకు అనేక సందర్భాల్లో ఇదే విషయాన్ని చెప్పారు. అయితే ఆ తర్వాత విడతల వారీగా రుణమాఫీ అని పేర్కొన్నది. రేషన్ కార్డ్ నిబంధన రావడంతో గందరగోళం నెలకొన్నది. టెక్నికల్ ఇష్యూస్ తోనూ లక్షలాది మంది రైతులు రుణమాఫీకి దూరమయ్యారు. మొదట రూ. 17వేల కోట్లు, ఆ తర్వాత రూ. 4వేల కోట్లు రుణమాఫీ చేశారు. అయినా ఇప్పటికీ లక్షలాది మంది రైతులు రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నారు. రూ. 2లక్షలకు పైగా ఉన్న రుణాన్ని కట్టేస్తే వారికీ రుణమాఫీ చేస్తామని చెప్పారు. దీంతో రైతులు అప్పులు తెచ్చి మరీ రూ. 2లక్షల కన్నా ఎక్కువగా ఉన్న రుణాన్ని బ్యాంకులకు చెల్లించారు. అయినా ఇప్పటికీ లక్షలాది మందికి రుణమాఫీ కాలేదు. దీంతో వారంతా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం మొదట అంచనా వేసుకున్న ప్రకారమే ఇంకా రూ. 10వేల కోట్ల మేరకు రుణమాఫీ చేయాల్సి ఉన్నది. ఎన్నికల సమయంలో రైతులకిచ్చిన హామీల అమలులో మాటమారుస్తుండడంతో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పై ఎఫెక్ట్ పడే అవకాశముందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నది.

You may also like

Leave a Comment