“రీ టెండర్లు” పిలిచి న్యాయం చేయండి…
మిర్యాలగూడ ఫిబ్రవరి 13, (తెలంగాణ ఎక్స్ ప్రెస్)
నల్లగొండ జిల్లా సివిల్ సప్లై స్టేజ్-2 (సెకండ్) కాంట్రాక్టుల టెండర్ల ప్రక్రియపై సంబంధిత శాఖల అధికారుల పాత కాంట్రాక్టర్ల వ్యవహారంపై పలు అనుమానాలు ఉన్నాయని మిర్యాలగూడ పట్టణానికి చెందిన టెండర్ దారులు శివశంకర్, వెంకటాచారి, సందీప్ లు ఆరోపించారు. స్థానికంగా మంగళవారం మిర్యాలగూడలో వారు విలేకరులతో మాట్లాడుతూ 2023- 25 సంవత్సరానికి సంబంధించిన సివిల్ సప్లై స్టేజ్ -2 (సెకండ్) కాంట్రాక్టుల టెండర్ల కోసం సంబంధిత శాఖ అధికారులు టెండర్ల తేదీని సక్రమంగా ప్రచారం చేయకపోవడంతో పాటు పాత కాంట్రాక్టర్లకు లాభం చేకూర్చే విధంగా నిబంధనలు కఠినం చేశారని ఆరోపించారు. ముఖ్యంగా నల్లగొండ జిల్లాలో ఎనిమిది ఎంఎల్ఎస్ పాయింట్లు ఉండగా, కేవలం 20 టెండర్ అప్లికేషన్లు మాత్రమే వచ్చాయని వారు వివరించారు. గతంలో ఒక్కో ఎంఎల్ఎస్ పాయింట్ కే సుమారు 10 నుంచి 20 టెండర్లు వచ్చేయని తెలిపారు. ప్రస్తుతం మాత్రం కొన్ని ఎంఎల్ఎస్ పాయింట్లకు కేవలం ఒకటి, రెండు టెండర్లు మాత్రమే వచ్చాయని, అనుమానాలకు తావిస్తుందన్నారు. పాత కాంట్రాక్టర్లు సంబంధిత శాఖల అధికారులను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి టెండర్ల ప్రక్రియపై విస్తృతంగా ప్రచారం నిర్వహించి, “రీ- టెండర్లు” పిలిచి కార్పొరేషన్ టెండర్ దారులకు, కాంట్రాక్టులు అప్పగించి న్యాయం చేయాలని వారు కోరారు.