పండుగ పూట పస్తులున్న సామాన్య జనం..
వీణవంక, జనవరి 15( తెలంగాణ ఎక్స్ ప్రెస్ ప్రతినిధి).
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం లో సంక్రాంతి పండుగ పూట సామాన్య జనానికి మాంసం ముద్ద కరువైంది.వీణవంక మండల కేంద్రంలో పండుగ పూట, అమాంతంగా చికెన్,మటన్ ధరలు ఒకేసారిగా పెరిగిపోగా, సామాన్య జనం, పేద ప్రజలు విలవల్లాడారు. పండుగకు ముందు కేజీ చికెన్ 160 ఉండగా, పండుగ రోజు కేజీ చికెన్ కు 200 రూపాయలు చేశారు. కేజీ మటన్ 700 రూపాయలు ఉండగా, పండుగ రోజున 800 రూపాయలు చేశారు. దీనితో సామాన్య ప్రజలు, నిరుపేదలు పండుగ పూట, ఏదో సంతోషంగా కుటుంబ సమేతంగా గడపాలనుకొని, షాపులకు వెళితే చికెన్ అదనంగా 40 రూపాయలు, మటన్ అదనంగా 100 రూపాయలు పెంచడంతో బింబెలెత్తిపోయారు.

ఇదేంటి అని నిలదీయగా , పండుగ వరకు ఇంతే అని సమాధానం ఇస్తున్నారని, జనం అసహనం వ్యక్తం చేస్తున్నారు. మటన్ షాపు,చికెన్ షాపు యజమానులు సిండికేట్ అయిపోయి, ప్రతి పండుగకు సిటీ ని, మించిపోయిన సిండికేట్ తో, ప్రతిసారి రేటు పెంచుకుంటూ పోయి, వారి స్వార్థానికి, పేద వాళ్లని బలి చేస్తున్నారని, పక్కన ఉన్న మానకొండూరు మండలంలోని పచ్చునూరులో కేజీ మటన్ 550 రూపాయలకు ఇస్తుంటే, ఇక్కడ 800 రూపాయలు ఏంటని, లింగాపూర్ లో కేజీ చికెన్ 140కి ఇస్తుంటే, ఇక్కడ మాత్రం 200 రూపాయలు తీసుకుంటున్నారని, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మటన్ షాపులపై, చికెన్ షాప్ లపై అధికారుల పర్యవేక్షణ చేస్తూ, ప్రజా ప్రతినిధులు, గ్రామ అధికారులు , వెటర్నరీ అధికారులు ధరల నియంత్రణ చేపట్టాలని, మండల ప్రజలు కోరుతున్నారు.