కామారెడ్డి, ఏప్రిల్ 26:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో)కామారెడ్డి జిల్లాకు శుక్రవారం వచ్చిన జహీరాబాద్ పార్లమెంటు నియోజక వర్గ వ్యయ పరిశీలకులు మోతిలాల్ షెటే, (ఐ.ఆర్.ఎస్. 2014)ను జిల్లా కలెక్టర్జితేష్ వి పాటిల్ , ఎస్పీ సింధు శర్మలు మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్కను ఇచ్చి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లాలో ఎన్నికల ప్రక్రియ ఏర్పాట్లు, వ్యయ నిర్వహణ కమిటీ, సహాయ వ్యయ పరిశీలకుల నియామకం, వ్యయ మానిటరింగ్ చేస్తున్న తీరుపై వారికి వివరించారు.
తెలంగాణ
కౌన్ బానేగా జహీరాబాద్ షా …రోజురోజుకు వేడెక్కుతున్న ఎన్నికల రాజకీయాలుముగిసిన నామినేషన్ల పర్వం…బీఆర్ఎస్ కంచుకోటను కాపాడుకునేందుకు కారు యత్నం….పాగ వేయాలని హస్తం ఆరాటం….వికసించాలని కమలం …జహీరాబాద్ స్థానంలో త్రిముఖు పోరు….గెలుపుపై ఎవరి ధీమా వారిదేఓటరు చేతుల్లో నేతల తలరాతలు ….ఎన్నికల ప్రచారానికి త్వరలో అగ్రనేతలు రాక ….మహిళా ఓటర్లె కీలకం…
ఎల్లారెడ్డి, ఏప్రిల్ 26:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
వచ్చే నెల మే 13 న జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల కోసం…వివిధ రాజకీయ పార్టీల నాయకుల ప్రచారంతో రాజకీయాల్లో రోజురోజుకు వేడెక్కుతుంది. నామినేషన్ ల స్వీకరణ పర్వం ముగియడంతో అగ్ర నేతలు అంతా ప్రచారంపైనే దృష్టి సారించారు. మరొక వైపు నామినేషన్ల ప్రక్రియ కొన సాగుతుందని అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. జహీరాబాద్ స్థానం నుంచి ప్రధాన పార్టీలైన బిజేపి, కాంగ్రెస్, బి ఆర్ ఎస్ పార్టీలు బలమైన అభ్యర్థులను బరిలోకి దింపారు. దీంతో మూడు పార్టీల మధ్య హోరాహోరి పోరు కనబడుతుంది. ఎన్నికల ప్రచారానికి ఇంకా 15 రోజుల గడువు ఉండడంతో బరిలో నిలిచిన అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకు నేందుకు ప్రచారం ముమ్మరం చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. జహీరాబాద్ పార్లమెంట్ స్థానంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. జహీరాబాద్, నారాయణఖేడ్, ఆందోల్, జుక్కల్, ఎల్లారెడ్డి , బాన్సువాడ, కామారెడ్డి, ఏడు స్థానాలలో సుమారు 14 లక్షల పైన మంది ఓటర్లు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ 2014, 2018 పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి వరుసగా రెండుసార్లు బిబి పటేల్ గెలుపొందారు. బిబి పాటిల్ కారు దిగి కమలదళంలో చేరారు. బిఆర్ఎస్ కంచుకోటను కాపాడుకునేందుకు కారు యత్నం చేస్తున్నారు. ఈ స్థానాన్ని ఎలాగైనా కైవాసం చేసుకోవాలని హస్తం పార్టీ పాగా వేసింది. ఈ స్థానాన్ని కమలం వికాసంతో ప్రధాని నరేంద్ర మోడీని మూడవసారి ప్రధాని చేసి ఈ స్తానాన్ని బహుమతిగా ఇవ్వాలని కమల దళం ప్రచారం ముమ్మరం చేసింది.
ప్రచారానికి 14 రోజుల గడువు…
ఈనెల 25 వ తేదీతో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగియడంతో నామినేషన్ల ఉపసంహరణ అనంతరం బరిలో నిచ్చిన అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి సురేష్ షేత్కార్, బిజెపి నుంచి బీబీ పాటిల్, బీఆర్ఎస్ నుంచి గాలి అనిల్ కుమార్ లు పోరులో ఉన్నారు. ప్రచారానికి మరో 14 రోజుల గడువు ఉండడంతో ఆయా పార్టీల అభ్యర్థులు నిర్దేశించుకున్న హామీలు పార్టీ మేనిఫెస్టోను ప్రచారంలో ప్రజల ముందుకు తీసుకెళ్లి తమకు అనుకూలంగా మలుచు కునేందుకు రంగంలోకి దిగారు. ఎన్నికల ప్రచారంలో తమ విజయాన్ని సొంతం చేసుకునేందుకు కాంగ్రెస్ , భాజపా, బీఆర్ఎస్ చెందిన అగ్రనేతలు త్వరలోనే ఎన్నికల ప్రచారానికి జహీరాబాద్ కు రానున్నట్లు సమాచారం. దీంతో జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కు తున్నాయి. జహీరాబాద్ పార్లమెంట్ స్థానంలో ప్రధాన పార్టీలతో పాటు ఇతర పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు అయినప్పటికీ ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, భాజపా, బిఆర్ఎస్ మధ్యనే ప్రధాన పోటీ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ మూడు పార్టీలకు చెందిన అగ్రనేతలు వీరి విజయం కోసం ఎన్నికల ప్రచారానికి రానున్నారు.
రోజురోజుకు ఖాళీ అవుతున్న బీఆర్ఎస్
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా జహీరాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ బరిలో ఉన్నప్పటికీ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రోజురోజుకు బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుంది. ఎల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఛైర్మన్ కుడుముల సత్యనారాయణ, వివిధ మండలాల జడ్పీటీసీలు, ఎంపీపీలు, మాజీ ఎంపీపీలు, తాజా మాజీ సర్పంచులు, సొసైటీ ఛైర్మన్లు కాంగ్రెస్, బీజేపీలో చేరారు. దింతో బీఆర్ఎస్ కు రోజురోజుకు గ్రాఫ్ తగ్గుతుంది.
కాంగ్రెస్ పార్టీలోకి భారీగా వలసలు
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఎన్నిల ప్రచారంలో జహీరాబాద్ లో రాజకీయం వేడెక్కుతోంది. వివిధ పార్టీలకు చెందిన నాయకులు కాంగ్రెస్ పార్టీలో వలసలతో క్యూ కట్టారు. ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి అసెంబ్లీ టికెట్ లో భంగపాటు పడి బీజేపీలో చేరిన వడ్డేపల్లి సుభాష్ రెడ్డి ఎల్లారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి 27000 వేల ఓట్లు సాధించారు. గురువారం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో వడ్డేపల్లి సుభాష్ రెడ్డి యు టర్న్ తీసుకుని కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ ఎల్లారెడ్డి మున్సిపల్ ఛైర్మన్ కుడుముల సత్యనారాయణ ఎమ్మెల్యే మదన్ మోహన్ సమక్షంలో మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. ఎల్లారెడ్డి, తాడ్వాయి ఎంపీపీలు, జడ్పీటీసీ ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరారు.
జహీరాబాద్ గడ్డపై కాషాయ జెండా ఎగిరెలా వ్యూహం
ఈసారి జహీరాబాద్ గడ్డపై బీజేపీ జెండా ఎగురవేసి ప్రధాని మోడీకి కానుక ఇవ్వాలని భావిస్తోంది. ఇందుకోసం బీజేపీ ప్రత్యేక వ్యూహలను రచించుకొని ప్రజల్లోకి వెళ్తున్నారు. జహీరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ భారీ మెజార్టీతో గెలిపించాలని బీజేపీ చేపట్టబోయే సంక్షేమ పథకాలు ఇంటికి తిరిగి ప్రచారం చేస్తూ బీబీ పాటిల్ గెలుపు కోసం కార్యకర్తలు సైనికుల్లా కృషి చేస్తున్నారు. ఈ త్రిముఖ పోటీలో గెలుపులో మహిళా ఓటర్లు కీలకం కానున్నారు. జహీరాబాద్ కా బాద్ షా కోసం జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే….
బీబీ.పాటిల్ ను వ్యక్తిగతంగా దూషిస్తే చూస్తూ ఊరుకోం…కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా బిజేపి గెలుపును ఆపలేరు…- బిజేపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాణాల లక్ష్మారెడ్డి
ఎల్లారెడ్డి, ఏప్రిల్ 26:- (తెలంగాణ ఎక్స్ ప్రెస్):
బిజెపి ఎంపి అభ్యర్థి బిబి పాటిల్ ను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వ్యక్తిగతంగా దూషిస్తే బిజేపి కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని, బీజెపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాణాల లక్ష్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఎల్లారెడ్డి పట్టణంలోని బిజేపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశం ఆయన మాట్లాడుతూ, బిజేపి ఎంపి అభ్యర్థి పై పార్టీ పరంగా విమర్శలు చెయ్యి…అంతే గాని వ్యక్తిగత దూషణల జోలికి వెళితే దాని పర్యవసనాలు వేరే లాగా ఉంటాయని హెచ్చరించారు. పదేళ్లు ఎంపిగా బిబి పాటిల్ చేసింది ఏమీ లేదని కాంగ్రెస్ అసత్య ప్రచారాలు మానుకోవాలని, బిబి పాటిల్ చేసిన అభివృద్ది పై తాము చర్చకు సిద్దం అని సవాలు చేశారు. కాంగ్రెస్ ఎంపీ తన 5 ఏళ్ల పదవి కాలంలో పార్లమెంట్ లో ఎన్ని సార్లు మాట్లాడారో తమ వద్ద రికార్డులు ఉన్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు పన్నినా బిజేపి గెలుపును ఆపలేరని అన్నారు. ఆ తర్వాత బిజేపి మండల అధ్యక్షుడు నర్శింలు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు చేసినా బిజెపి గెలుపును ఎవరు ఆపలేరని అన్నారు. ఎల్లారెడ్డిలో బీబీ పాటిల్ గెలవకుండా ఉండేందుకు కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు చేసిన ఈ కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. పార్లమెంట్ కు జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెస్ పార్టీతోనే పోటీ అని అన్నారు . పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి బుద్ది చెప్పి, భారతీయ జనతా పార్టీ జహీరాబాద్ గడ్డపై కాషాయపు జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు భయబ్రాంతులకు గురి చేస్తే భయపడేది లేదని అన్నారు. ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. కార్యకర్తలు అధైర్య పడకుండా, దైర్యంగా పని చేయాలని కోరారు. జహీరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ కు ఎల్లారెడ్డి, మండలంలో లీడ్ ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి నెరెల్ల ఆంజనేయులు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాణాల లక్ష్మారెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు పైడి ఎల్లారెడ్డి, పట్టణ అధ్యక్షులు సతీష్ తదితరులు పాల్గొన్నారు.
పెద్ద శంకరంపేట్ సీఎం బహిరంగ సభలో వేదికపై సీఎం పక్కనే కూర్చున్న ఎల్లారెడ్డి ఎమ్యెల్యే
హైదరాబాద్, ఏప్రిల్ 26(తెలంగాణ ఎక్స్ ప్రెస్ స్టేట్ బ్యూరో):-జహీరాబాద్ ఎంపీ సెగ్మెంట్ పరిధిలోని పెద్ద శంకరంపేట్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ జనజాతర సీఎం రేవంత్ రెడ్డి భారీ సభలో వేదికపై ఎల్లారెడ్డి ఎమ్యెల్యే కె.మదన్ మోహన్ రావు సీఎం రేవంత్ రెడ్డి పక్కనే కూర్చొని వున్నారు. మరో పక్క మంత్రి దామోదర రాజనర్సింహ వున్నారు. సీఎం రేవంత్ రెడ్డి స్వాగత సమయంలో పక్కనే వున్నారు. సభలో వేదిక పై తకంటూ ఎల్లారెడ్డి ఎమ్యెల్యే ప్రత్యేకతను చాటుకున్నారు.
ఎల్లారెడ్డి, ఏప్రిల్ 26,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కార్ గెలుపుకోసం ఎన్నికల ప్రచారంలో భాగంగా, శుక్రవారం సంగారెడ్డి జిల్లా పెద్ద శంకరం పేట్ లో సాయంత్రం జరిగిన జన జాతర భారీ బహిరంగ సభకు రాష్ట్ర సిఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజర య్యారు. సిఎం తో పాటు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, కాంగ్రెస్ పార్టీ ఎంపి అభ్యర్థి సురేష్ శేత్కార్, ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి ఎమ్మెల్యే మదన్ మోహన్ లు హాజరయ్యారు. ఇట్టి భారీ బహిరంగ సభకు, ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ నాయకులు ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన స్థానిక మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ అధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు తరలి వెళ్ళారు. తరలిన వారిలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మైసాని ఈశ్వర్ గౌడ్, ఎంపిటిసి సంతోష్ మాజీ జడ్పీటిసి చినబాలి సామేల్, మాజీ ఎంపీటీసీ షకావత్ అలీ, నాయకులు సయ్యద్ గఫార్ , షేర్ల సోమేశ్వర్ తదితరులు ఉన్నారు.
ఎల్లారెడ్డి, ఏప్రిల్ 25:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో) ఎల్లారెడ్డి మండలంలోని మాచాపూర్ గ్రామానికి చెందిన చాకలి ప్రవల్లిక అనే బాలిక షాప్ కు వెళ్లి వస్తా అంటూ వెళ్లి తిరిగి రాలేదని ఆమె కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాలిక మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ. మహేష్ తెలిపారు. శుక్రవారం ఎస్ఐ. మాట్లాడుతూ..ఇంటి నుండి వెళ్లి తిరిగి రాకపోవడంతో బంధు, మిత్రుల ఇళ్లలో వెతికి ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీస్ స్టేషన్ వచ్చి ఫిర్యాదు చేసారని తెలిపారు. ఎవరికైనా ఆచూకి తెలిస్తే వెంటనే ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ ఎస్ఐ మొబైల్ 8712686160 కి కాల్ చేసి సమాచారం ఇవ్వాల్సిందిగా కోరారు.
ప్రజాస్వామ్య ప్రతిష్టతకు ఓట ప్రతి ఓటర్ ఓటువేసేలా అవగాహన కలిపించాలి… జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్
కామారెడ్డి, ఏప్రిల్ 25:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో)ప్రజాస్వామ్య ప్రతిష్టతకు ఓటుహక్కు ఉన్న ప్రతి ఒక్కరు ఓటువేసేలా అవగాహన కలిగించవలసినదిగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మహిళా సమాఖ్య సంఘ సభ్యులకు సూచించారు. ఓటరు అవగాహాన కార్యక్రమంలో భాగంగా గురువారం స్వీప్ ఆధ్వర్యంలో పట్టణ మహిళా సమాఖ్య సభ్యులతో మునిసిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో సరాసరి 80 శాతం ఓటు నమోదు కాగా పట్టణ ప్రాంతాలలో కేవలం 60 శాతం మాత్రమే నమోదవుతున్నదని అన్నారు. వంద శాతం ఓటింగ్ నమోదయితే ఫలితాలను ప్రభావితం చేస్తాయని, కాబట్టి పట్టణంలోని 1547 మహిళా సమాఖ్య సంఘాలు 16 వేల మంది సభ్యులతో సమావేశాలు ఏర్పాటు చేసి ఓటు ప్రాముఖ్యతపై అవగాహాన కలిగించి ప్రతి ఒక్కరు ఓటు వేసేలా చైతన్యం తేవాలన్నారు. ఐదేండ్లకు ఒకసారి వచ్చే ఎన్నికలలో సరైన అభ్యర్థిని ఎన్నుకోవడం ద్వారా దేశాభివృద్ధికి బాటలు వేసినవారవుతామని అన్నారు. ప్రతి అభ్యర్థి వివరాలను భారత ఎన్నికల సంఘం పారదర్శకంగా తమ వెబ్ సైట్ లు పొందుపరుస్తుదని , ఓటర్లు విజ్ఞతతో ఓటు వేయాలని కోరారు. మే 13 హాలిడే కాదని ,ఓటు హక్కు వినియోగించుకొనుటకు ప్రభుత్వం కల్పించే వెసులుబాటని, ఇది ప్రతి ఒక్కరు గమనించి బద్ధకం వీడి ఓటు వేయాలని కోరారు. దేశ స్వాతంత్య్రం కోసం ఎందరో మహానుభావులు తమ జీవితాలను త్యాగం చేశారని, కానీ మిమ్మల్ని కోరేది ఒక్కటే రాజ్యాంగం కల్పించినఓటు హక్కును తమ నైతిక బాధ్యత గా వినియోగించుకొని వంద శాతం పోలింగ్ నమోదయ్యేలా చూడాలన్నారు.అనంతరం ఎలాంటి ప్రలోభాలకు లోగాక నిష్పక్షపాతంగా, నిర్భయంగా ఓటు వేస్తానని ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో స్వీప్ నోడల్ అధికారి వెంకటేష్, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి, మునిసిపల్ కమీషనర్ సుజాత, పట్టాన మహిళా సమాఖ్య సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి, ఏప్రిల్ 25:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో) జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఎల్లారెడ్డి నియోజకవర్గం రామారెడ్డి మండల కేంద్రంలో గురువారం రాత్రి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ఎల్లారెడ్డి ఎమ్యెల్యే మదన్ మోహన్ రావు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సంధర్బంగా ఎమ్యెల్యే మాట్లాడుతూ..రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కేంద్రంలో సైతం కాంగ్రెస్ సర్కార్ అధికారంలో వస్తే నియోజక వర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయొచ్చన్నారు. అందుకె జహీరాబాద్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కార్ ను గెలిపించాలన్నారు. పెద్ద ఎత్తున బైక్ ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అవకాశవాద రాజకీయాలకు అలవాటు పడి అసత్య ఆరోపణలు చేస్తున్నారు. మీరు మీ అనుచరులు జానారెడ్డి ఇంటి వద్ద పడి కాపులు కాస్తున్న విషయం వాస్తవం కాదా..?
మిర్యాలగూడ ఏప్రిల్ 25:- (తెలంగాణ ఎక్స్ ప్రెస్) మిర్యాలగూడ పట్టణ అధ్యక్షుడిగా ఉన్న తిరునగరు భార్గవ్ కేసిఆర్ రోడ్ షో కార్యక్రమానికి ప్రణాళిక రూపొందించడానికి మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు పలుసార్లు ఫోన్ ద్వారా సంప్రదించారని, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఫోన్ ద్వారా ఆహ్వానించడం జరిగిందన్న విషయం వాస్తవం కాదా.. అని బిఆర్ఎస్ సీనియర్ నాయకులు నాగార్జున చారి, బాసాని గిరి, భీమ్లా నాయక్, జానీ, ఐల వెంకన్న, సాధినేని శ్రీనివాసరావు, ఇస్మాయిల్ (చోటు) చిట్టిపోలు వెంకటేశ్వర్లు, దినేష్ గయాస్, అంజన్ రాజు, విష్ణు లు ప్రశ్నించారు. గురువారం మిర్యాలగూడ పట్టణ బిఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పలుమార్లు ఫోన్ చేసినా ఫోన్ హిస్టరీ నే రుజువు అన్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొన్ని ముఖ్య కార్యక్రమాలకు ఆహ్వానించిన, నియోజకవర్గ స్థాయి సమావేశాలకు, నల్గొండలో జరిగిన పార్లమెంట్ నియోజకవర్గస్థాయి సమావేశాలకు హాజరు కాలేదన్న విషయం అందరికి తెలిసిందే అన్నారు. తమ అనుచరులతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీ మార్పుపై చర్చలు చేయడం అందరికి తెలిసిన బహిరంగ రహస్యమే అని వారన్నారు. అవకాశవాద రాజకీయాలకు అలవాటు పడి అసత్య ఆరోపణలు చేయడం సబబు కాదన్నారు. కెసిఆర్ రోడ్ షోకు వచ్చిన జనాధారణ చూసి ఓర్వలేక ఇటువంటి అవకాశవాద ప్రచారాలు చేస్తున్నారని, కాంగ్రెస్ సూచనతో ఇటువంటి అసత్య ప్రచారాలు మానుకోవాలని సూచించారు. గత ఎనిమిది సంవత్సరాల నుండి మిర్యాలగూడ పట్టణంలో అన్ని కార్యక్రమాలకు అనేకమంది పార్టీ కోసం నిరంతరం శ్రమించే కార్యకర్తలను దూరంగా ఉంచి, మీరే అన్ని ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్న సందర్భాలు పార్టీ కార్యకర్తలకు నాయకులకు ప్రజలకు తెలుసు అన్నారు. మీరు పార్టీ మారుతారు అన్నది వాస్తవం కాదా..? వాస్తవం కాకపోతే మీరు మీ అనుచరులు పలుమార్లు జానారెడ్డి ఇంటి వద్ద పడి గాపులు కాస్తున్న విషయం వాస్తవం కాదా..? అని ప్రశ్నించారు. మీ చేరికను పట్టణ కాంగ్రెస్ కమిటీ వారు వ్యతిరేకిస్తూ పేపర్ ప్రకటన ఇవ్వడం, తీర్మానాలు చేయడం, పత్రిక ప్రకటనలు ఇవ్వడం వాస్తవం కాదా..? భాస్కర్ రావు సహకారంతో రెండుసార్లు మున్సిపల్ చైర్మన్ పదవులు, నీ అనుచరులు కౌన్సిలర్ పదవులు అనుభవించడం ప్రజలకు తెలుసు అన్నారు. మిర్యాలగూడలో అనేకమంది ఉద్యమకారులు ప్రతిభ కలిగిన నాయకులు ఉన్నప్పటికీ భాస్కరరావు మీకు ప్రత్యేకతను కల్పించి రెండు కీలకమైన పదవులు ఇవ్వడం జరిగిందన్నారు. అధికారం కోసం పార్టీలు మారుతూ అసత్య ప్రచారాలు మాను కోవాలన్నారు. మీరు బిఆర్ఎస్ పార్టీను ఉపయోగించుకున్నారు అనేది ప్రజల అభిప్రాయం రాజకీయ ప్రాధాన్యత లేని ప్రజలను అడిగిన మాజీ శాసనసభ్యులు నలమోతు భాస్కర్ రావు ఎవరికి ప్రాధాన్యత ఇచ్చినారో తెలుసుకొని, ఇప్పటికైనా బిఆర్ఎస్ పార్టీ ప్రతిష్టకు కలసి రావలసిందిగా కోరుతున్నామన్నారు.
ఏప్రిల్ 25 నుంచి మే 8 వరకు ఓటర్ స్లిప్పుల పంపిణీజిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్
కామారెడ్డి: ఏప్రిల్ 24 :-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో) ఏప్రిల్ 25 నుంచి మే 8 వరకు జిల్లాలోని ఓటర్లకు బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికి వెళ్లి ఓటర్ స్లిప్పులు పంపిణీ చేస్తారని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం ఆయన రాజకీయ పార్టీల ప్రతినిధులకు పార్లమెంట్ ఎన్నికల పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటర్లకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై అవగాహన కల్పించాలని తెలిపారు. ఓటు వేసేందుకు ఓటర్లు ఆధార్ కార్డు, పాన్ కార్డ్, బ్యాంక్ పాస్ పుస్తకం, డ్రైవింగ్ లైసెన్స్, ఉపాధి హామీ కార్డు వంటి వాటిలో ఒక దానిని తప్పనిసరిగా తీసుక వెళ్లే విధంగా రాజకీయ పార్టీల ప్రతినిధులు అవగాహన కల్పించాలని చెప్పారు. పోలింగ్ స్టేషన్ వివరాలు తెలియజేయాలని సూచించారు. ఎన్నికల ప్రచారం, సభలకు రాజకీయ పార్టీల ప్రతినిధులు ముందస్తుగా అనుమతులు పొందాలని తెలిపారు. అనుమతులు లేకుండా ర్యాలీలు, సభలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. జనవరి 23 నుంచి ఏప్రిల్ 15 వరకు మూడు నియోజకవర్గాల్లో 6007 మంది కొత్త ఓటర్లు నమోదు చేసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. జుక్కల్ నియోజకవర్గం లో1815, ఎల్లారెడ్డిలో 1798, కామారెడ్డిలో2394 మంది యువతీ, యువకులు నమోదు చేసుకున్నట్లు చెప్పారు. 18 నుంచి 19 ఏళ్ల యువతి యువకులు ఓటర్లుగా నమోదు చేసుకున్నట్లు వెల్లడించారు. సమావేశంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రభాకర్ రెడ్డి, కాశీంఅలీ, నరేందర్, ఎన్నికల విభాగం అధికారులు అనిల్ కుమార్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.