- రుద్ర సముద్రం రామలింగం..
మక్తల్, డిసెంబర్ 11:- ( తెలంగాణ ఎక్స్ ప్రెస్): నారాయణపేట జిల్లా మక్తల్ మండలం రుద్రసముద్రం గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు రుద్ర సముద్రం రామలింగం సోమవారం మరోసారి తన దయార్ధ హృదయాన్ని చాటుకున్నారు. వరంగల్ జిల్లాకు చెందిన జగదీష్(65) అనే వృద్ధుడు ఇటీవల మతిస్థిమితం సరిగా లేక ఇంట్లో నుంచి బయటకు వచ్చి, పలు ప్రాంతాల్లో తిరుగుతున్నాడు. సోమవారం ఉదయం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ సమీపంలో తచ్చాడుతున్న జగదీష్ ను రుద్రసముద్రం రామలింగం మానవీయ కోణంలో ఆలోచించి అక్కున చేర్చుకున్నాడు. గత వారం రోజులుగా జగదీష్ కు సరైన ఆహారం లేక నిరసించి పోవడంతో స్థానిక టిఫిన్ సెంటర్లో అల్పాహారం తినిపించి సపర్యలు చేశారు. ఆ తర్వాత జగదీష్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకొని, జగదీష్ కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడి తిరిగి ఆయన క్షేమంగా కుటుంబీకుల వద్దకు చేరుకునేందుకు గాను వరంగల్ వరకు వెళ్లేందుకు రైల్వే ప్రయాణ టికెట్ ను తీయించడంతో పాటు మరికొంత ఆర్థిక సాయం అందించి ట్రైన్ ను ఎక్కించి పంపించారు. ఈ సందర్భంగా పలువురు రుద్ర సముద్రం రామలింగంను ప్రత్యేకంగా అభినందించారు.
