భయాందోళన పడుతున్న ప్రజలు
మంచిర్యాల, జనవరి 23, (తెలంగాణ ఎక్స్ ప్రెస్): కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలో గల జన్నారం మండలం, మహమ్మద్ బాద్ గ్రామ సమీపంలో ఎలుగుబంటి సంచరీస్తున్నట్లు కనబడుతుంది. మంగళవారం సాయంత్రం మంచిర్యాల జిల్లా, జన్నారం మండలం, మహమ్మద్ బాద్ గ్రామం కొంచెం దూరంలో ఉన్న వాగు బిర్జి రహదారి నుండి ఎలుగుబంటి వెళుతూ ఉండగా ప్రయాణికులు గమనించారు. రోడ్డు నుండి వెళ్లే ఇరువైపుల వాహనాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. స్థానికుల ద్వారా గ్రామ సమీపంలో ఎలుగుబంటి సంచరిస్తుందన్నట్లు సమాచారం అందుకున్న అటవీ అధికారులు అక్కడకు చేరుకుని, కొంత సమయం వరకు ఎక్కడి వాహనాలు అక్కడే నిలిపివేశారు. అటవీ అధికారుల అనుమతి లేనిది, ఆ రహదారి నుండి వాహనాలు వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేశారు. మహమ్మద్ బాద్ గ్రామ ప్రజలు రాత్రి వేళలో బయటకు వెళ్లే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని అటవీ అధికారులు తెలిపారు. ఇప్పటికైనా కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలో నుండి ప్రధాన రహదారి గుండ అడవి జంతువులు గ్రామాల్లోకి రాకుండా కంచవేయాలని, జన్నారం మండల పలు గ్రామాల ప్రజలు ప్రజా ప్రభుత్వం కోరుకుంటున్నారు.