ఎల్లారెడ్డి, డిసెంబర్ 14,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థులకు నాణ్యమైన ,రుచికరమైన భోజనం అందించాలని, ఎల్లారెడ్డి ఆర్డీఓ మన్నె ప్రభాకర్ సూచించారు. శనివారం స్థానిక సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాలలో రాష్ట్ర సర్కార్ నూతనంగా ప్రవేశ పెట్టిన కామన్ డైట్ ప్రోగ్రాం కు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…గత పది సంవత్సరాలుగా వసతి గృహాలలోని విద్యార్థుల గురించి గత ప్రభుత్వం పట్టించుకోలేదని, పెరిగిన ధరలకు అనుగుణంగా, రాష్ర్ట కాంగ్రెస్ సిఎం రేవంత్ రెడ్డి సర్కార్ విద్యార్థుల మెస్ , కాస్మొటిక్ చార్జీలు పెంచి విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసింది అన్నారు. నూతన కామన్ మెనూ ప్రకారం భోజనాన్ని విద్యార్థులకు అందించాలని అన్నారు. విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని చదువులో రాణించాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ తో పాటు బాలుర ఉన్నత పాఠశాల హెచ్ ఎం.మాణిక్యం, ప్రిన్సిపాల్ నాగేశ్వర్ రావు, వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్, సీనియర్ జూనియర్ లెక్చరర్ రాంకుమార్, ఉపాద్యాయులు, విద్యార్థుల తల్లి తండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
*ఎస్సీ బాలికల వసతి గృహంలో*….
అనంతరం స్థానిక ఎస్సీ బాలికల వసతి గృహన్ని సందర్శించి కామన్ మెనూ డైట్ చార్ట్ ను ప్రారంభించారు. ముందుగా వార్డెన్, విద్యార్థినిలు ఆర్డిఓ కు ఘనంగా స్వాగతించారు. ఆతర్వాత ఆయన మాట్లాడుతూ …విద్యార్థినీలకు నాణ్యమైన భోజనం అందించాలని, రానున్న టెన్త్ వార్షిక పరీక్షల కోసం ఇప్పటి నుంచే ప్రణాళిక బద్దంగా సబ్జెక్టులవారిగా చదివి, వంద శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా కృషి చేయాలని అన్నారు. అంతకు ముందు విద్యార్థినిలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఆతర్వాత ఆర్డీఓ విద్యార్థినులతో కలిసి సహపంక్తి భోజనం చేసి, భోజనం రుచికరంగా ఉండటం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ తో పాటు వసతి గృహ వార్డెన్ శారద, విద్యార్థినిల తల్లి తండ్రులు, విద్యార్థినిలు, వసతి గృహ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


