భక్తులకు వసతుల కల్పన పారిశుధ్యం పై మండిపాటు…
పని ఒత్తిడి అయితే లీవ్ పెట్టి వెళ్లిపోవాలని ఈవోను హెచ్చరించిన విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్…
తెలంగాణ ఎక్స్ ప్రెస్ దినపత్రిక
వెల్గటూర్ నవంబర్ 15
శాతవాహనుల తొలి రాజధానిగా మహా శైవ క్షేత్రంగా చరిత్ర పుటల్లో నిలిచి పోయిన కోటిలింగాలను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతా నని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని శుక్రవారం కోటిలింగాల కోటేశ్వర స్వామి ఆలయానికి విప్ విచ్చే యగ ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలుకారు . ఆయన స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాదాయ ధర్మాదాయ, తెలంగాణ టూరిజం, పురావస్తు శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ నిధులు విడుదలకు కృషి చేసి కోటిలింగాల ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దామని హామీ ఇచ్చారు. స్థానిక నాయకులు భక్తులతో కలిసి ఆలయ పరిసరాలలో గోదావరి తీరం వెంబడి గంట పాటు పర్యటించి అనంతరం స్థానిక నాయకులతో కలిసి బోటింగ్ చేశారు. గత ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉండి కోటిలింగాల చారిత్రక ప్రదేశాన్ని నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. అప్పటి నాయకులు పర్యాటక కేంద్రం చేస్తానని మాట ఇచ్చి మరిచి పోయారని అన్నారు. గతంలో జరిపిన పురావస్తు తవ్వకాల్లో వెలువడిన అవశేషాలతో కూడిన మ్యూజియం ను ఇక్కడ ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానని ,ఈ ప్రదేశం యొక్క గొప్పదనాన్ని శాతవాహనుల వారసత్వ సంపద గూర్చి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్తానన్నారు. అలాగే కోటేశ్వర స్వామి శైవ క్షేత్ర మహత్యమును గురించి మంత్రి కొండా సురేఖ దృష్టికి తీసుకువెళ్లి ఆలయ అభివృద్ధి కోసం నిధుల విడుదలకు కృషి చేస్తామన్నారు. త్వరలో ఒక సమావేశం ఏర్పాటు చేసి ఇక్కడికి వచ్చే భక్తుల కోసం వసతుల కల్పనకు చర్యలు చేపడతామన్నారు. భక్తులకు అవసరమైన షెడ్ల తో పాటు అన్ని రకాల మౌళిక వసతుల కల్పనకు నిధులు విడుదల చేస్తామన్నారు. కోటిలింగాలను మరింత అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేంతవరకు విశ్రమించేది లేదని కోటేశ్వరుని సాక్షిగా ప్రకటిస్తున్నట్లు తెలిపారు.

-భక్తులకు వసతుల
లేమి పై విప్ ఈవో పై మండిపాటు
కార్తీక పౌర్ణమి సందర్భంగా కోటిలింగాలలో భక్తుల కోసం చేసిన ఏర్పాట్లు సరిగా లేవని ఈవో కాంతా రెడ్డి పై విప్ లక్ష్మణ్ కుమార్ మండిపడ్డారు. పని ఒత్తిడి ఎక్కువైనట్లయితే ఈ టెంపుల్ వదిలి మరో టెంపుల్ చూసుకోవాలని హెచ్చరించారు. ఈ విషయాన్ని అక్కడి నుంచే దేవాదాయ కమిషనర్ కు ఫోన్ ద్వారా తెలియజేశారు. త్వరలో ఆలయాన్ని సందర్శించి ఇక్కడ చేయవలసిన ఏర్పాట్లపై ఒక ప్రణాళిక సిద్ధం చేసి ఇవ్వాలని కమిషనర్కు సూచించారు. ఇంత పెద్ద సంఖ్యలో వచ్చే భక్తుల కోసం చేయాల్సిన ఏర్పాట్లపై ఇంతగా నిర్లక్ష్యం వహించ డం సరైంది కాదన్నారు. కనీస వసతులు కూడా కల్పించడంలో శ్రద్ధ పెట్టకపోవడం ఏంటని ప్రశ్నించారు. మహిళల బట్టలు మార్చుకోవడానికి సరైన ఏర్పాట్లు చేయకపోవడం ఎండ వేడిమి నుండి భక్తులు సేద తీరేందుకు టెంట్లు వేయక కపోవడం పారిశుద్యం సరిగా లేకపోవడం లాంటి వాటిపై విప్పు ఆలయ అధికారిపై మండిపడ్డారు.
-ఆదాయం ఉన్నా అభివృద్ధి ఎందుకు చేయటం లేదు.

టెంపుల్ కు వచ్చే భక్తులతో పాటు కోటిలింగాల వచ్చే పర్యాటకుల నుంచి పార్కింగ్ పేరుతో నెలనెలా లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు, టెంపుల్ కు కూడా భక్తుల నుంచి ఆదాయం వస్తుంది. ఈ ఆదాయం అంతా ఎక్కడ పోతుంది, ఎందుకు ఆలయాన్ని అభివృద్ధి చేయడం లేదు భక్తులకు మౌళిక వసతుల ను కల్పించడం లేదని ఈవో కాంత రెడ్డి పై విప్ మండిపడ్డారు. పార్కింగ్ ఆదాయానికి తమకు సంబంధం లేదని అది గ్రామపంచాయతీ చూసుకుంటుందని ఈవో చెప్పగా అక్కడినుండే డిపీ వో కు ఫోన్ చేసి గత ఐదు సంవత్సరాలలో ఎన్ని లక్షల రూపాయలు పార్కింగ్ పేరుతో వసూలు చేశారు.ఆ నిధులను ఎలాంటి అభివృద్ధి పనులకు వినియోగించా రో తక్షణమే తనకు వివరాలు తెలియజేయాలని విప్ డిపీ వో ను ఆదేశించారు. అలాగే టెంపుల్ ఆదాయ వివరాలు ఈవో ను కనుక్కొని మరి కొంతమంది స్కావెంజర్స్ నియమించి పారిశుధ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఇక్కడికి వచ్చే భక్తులకు కావలసిన వసతుల కల్పన పై మరోసారి ఇలాంటి నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శైలేందర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, శ్రీకాంత్ రావు, మురళి సందీప్ రెడ్డి రమేష్ నరేష్ సాయి తదితరులు ఉన్నారు