నారాయణపేట జిల్లా ప్రతినిధి అక్టోబర్ 26 (తెలంగాణ ఎక్స్ ప్రెస్):
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి శనివారం నారాయణపేట జిల్లా మద్దూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు స్వర్గీయ సతీష్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించి సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఆయన సతీష్ తల్లిదండ్రులు, భార్యా పిల్లలతో పాటు ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు.
కాగా మద్దూర్ కు చెందిన కాంగ్రెస్ నాయకుడు సతీష్ ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి హెలికాఫ్టర్ ద్వారా మద్దూరుకు చేరుకొని సతీష్ స్వగృహంలో నిర్వహించిన దశ దినకర్మ కార్యక్రమానికి హాజరయ్యారు. సతీష్ కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా సతీష్ భార్య సంగీత తన ఇద్దరు కుమారులు వీరేష్, ఆదిత్య ల ఉన్నత చదువులకు సాయం చేయాలని సీఏం ను కోరగా అందుకు సీఎం సానుకూలంగా స్పందించారు. జాతీయస్థాయిలో వాలీబాల్ పోటీలలో ప్రతిభ చాటిన సతీష్ తమ్ముడు మణికంఠ తనకు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగ అవకాశం ఇప్పించాలని రెజూమ్ ను సీఎం రేవంత్ రెడ్డికి అందజేయగా పరిశీలించాలని కడ ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి ని సీఎం ఆదేశించారు. అలాగే సతీష్ సోదరి వీరమణి బిడిఎస్ పూర్తి చేసిన తన కొడుకుకు ఉద్యోగ అవకాశం కల్పించాలని సీఎం కు విన్నవించారు. సతీష్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని సీఎం భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మక్తల్ ఎమ్మెల్యే వాకిడి శ్రీహరి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, ట్రైనీ కలెక్టర్ గరిమానరుల, జోగులాంబ గద్వాల జోన్ -7 డి ఐ జి ఎల్.ఎస్. చౌహాన్ , జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ వార్ల విజయకుమార్, మద్దూరు జెడ్పిటిసి రఘుపతి రెడ్డి, డిసిసి అధ్యక్షులు ప్రశాంత్ రెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.


