ఎల్లారెడ్డి, ఏప్రిల్ 2, (తెలంగాణ ఎక్స్ ప్రెస్):
రైతులు యాసంగిలో ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని దళారులకు విక్రయించి మోసపోవద్దు అని, వెల్లుట్ల సొసైటి సి ఈ ఓ పట్లోళ్ల రాంచందర్ అన్నారు. మంగళవారం మండలంలోని వెల్లుట్ల సొసైటి పరిధిలోని వెల్లుట్ల, వెల్లుట్ల పేట్, తిమ్మారెడ్డి గ్రామాల్లో సొసైటి వారి అధ్వర్యంలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సి ఈ ఓ గ్రామాల రైతులతో కలిసి, టెంకాయలు కొట్టి వరి ధాన్యం తూకం చేసి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈసందర్భంగా సి ఈ ఓ మాట్లాడుతూ.. రైతులు ఆరు కాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని దళారులకు విక్రయించి మోసపోవద్దని, ప్రభుత్వం చే ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందా లన్నారు. ప్రభుత్వం క్వింటాలు ధాన్యం ఏ గ్రేడ్ రకం 2,203, బి గ్రేడ్ రకం 2,183 రూపాయల మద్దతు ధర చెల్లిస్తుంది అని అన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతులు ధాన్యాన్ని శుభ్రం చేసి, మంచిగా ఆరబెట్టి సంబంధిత బ్యాంకు ఖాతా పుస్తకం, పట్ట పాస్ పుస్తకం, ఏ ఈ ఓ ధృవీకరణ పత్రంతో కొనుగోలు కేంద్రానికి వచ్చి కేంద్రం నిర్వాహకులకు ఇవ్వాలని సొసైటి సి ఈ ఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో వెల్లుట్ల సొసైటి సిఈఓ పట్లోళ్ళ రాంచందర్, ఏఈఓ రాజగౌడ్, గ్రామాల పెద్దలు కృష్ణా రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, గోలి వసంతం, రైతులు తదితరులు పాల్గొన్నారు.