బిచ్కుంద ఫిబ్రవరి 6 :-(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
కామారెడ్డి జిల్లా, బిచ్కుంద మండలం లో నిఘా నిద్రపోతుంది,దగా రాజ్యమేలుతుందనే చందంగా మంజీరా నదిలో అక్రమ ఇసుక దందా అర్దరాత్రిలో జోరుగా జీరో దందా కొనసాగుతుందని స్థానిక ప్రజలు వాపోతున్నారు.మండలంలోని మంజీరా నదిలో కొందరు ఇసుక గుత్తేదారులు అడ్డాగా చేసుకోని రాత్రివేలలో పదుల కొద్ది ట్రాక్టర్లలోఎటువంటి అనుమతిపత్రాలు లేకుండా పూర్తిగా జీరో దందా నడిపిస్తున్నారు. బిచ్కుంద మండలం , మంజీరా నది తీరం నుంచి మంజీరా పరివాహక గ్రామానికి (హస్గుల్ )చెందిన ఇద్దరు వ్యక్తులు అధికార పార్టీ నాయకుల అండదండలతో అక్రమ ఇసుక వ్యాపారానికి తెరలేపారు.
అర్ధరాత్రి వేళలో ఇసుక ట్రాక్టర్లతో మండల కేంద్రానికి, తదితర దూర ప్రాంతాలకు ఇసుకను తరలిస్తూ లక్షల రూపాయాలు జేబులు నింపుకుంటున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతుంది. ఇదంతా టిఎస్ఎండిసి, మైనింగ్ అధికారుల కనుసన్నల్లోనే జరుగుతుందని ఆరోపణలు స్థానికుల నుంచి వెల్లువెత్తుతున్నాయి. ఎన్ని ఆరోపణలు ఎదురైనా అధికారులు ముక్కున వేలు వేసుకొని, కళ్లకు గంతలు కట్టుకొని ఇసుక దందా నడిపిస్తున్నారని స్థానికులు అంటున్నారు.
నిత్యం అర్ధరాత్రి వేళల్లో పదుల సంఖ్యలో జీరో ఇసుక ట్రాక్టర్లు నడుస్తున్న స్థానిక అధికారులు ఎప్పుడో పున్నమికి ఒక్కసారి ఇసుక ట్రాక్టర్ లను పట్టుకోవడం, కొందరు నేతలు వాటికి నామమాత్రంగా జరిమానా కట్టి విడిపించుకుని పోవడం పరిపాటిగా మారింది.
పట్టించుకోని సంబంధిత అధికారులు..
ఇసుక ర్యాంపుల్లో ఎలాంటి అక్రమాలు జరిగిన టిఎస్ఎండిసి,మైనింగ్, రెవెన్యూ శాఖ అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుంది.కానీ కంచె చేను మేసే చందంగా అధికారులు వ్యవహరిస్తున్న తీరు పలు అనుమానాలకు తావిస్తుంది.నిత్యం మంజీరా నదిలోని ఇసుక క్వారీలో అక్రమాలు జరుగుతున్నా అధికారులు ఎందుకు పర్యవేక్షించడం లేదని ప్రశ్నార్ధకంగా మారింది.
బీనామీలు ఇస్తున్న మామూళ్లకు అలవాటు పడి అక్రమాలను అదుపు చేయడం లేదనేది స్థానికులు వాదన.అర్ధరాత్రి అధికంగా ఓవర్ లోడ్ ల ద్వారా జీరో ట్రాక్టర్ల ద్వారా అధికారులు సొమ్ము వెనుక వేసుకుంటున్నారని స్థానికులు అనుకుంటున్నారు. ఈ అక్రమాలపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, జీరో దందాకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు, ప్రజా సంఘాలు కోరుతున్నాయి.