మంచిర్యాల జిల్లాలోని బీసీ బిడ్డలు ఐక్యంగా కదలి వచ్చి ఉద్యమించాలి
మంచిర్యాల, ఫిబ్రవరి 15, (తెలంగాణ ఎక్స్ ప్రెస్): మార్చి నెల 3వ నుండి మంచిర్యాల జిల్లాలో బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో బీసీ చైతన్య యాత్ర కొనసాగనున్నదని బీసీ సంఘాల నాయకులు పేర్కొన్నారు. గురువారం మంచిర్యాల బీసీ భవన్ లో జరిగిన సమావేశంలో కరపత్రాలను ఆవిష్కరించారు. మంచిర్యాల జిల్లా పట్టణంలోని అమరవీరుల స్థూపం దగ్గర నుండి బీసీ చైతన్య యాత్ర ప్రారంభం కానున్నదని బీసీ ఐక్యవేదిక సమక్షంలో తెలిపారు. ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి, సామాజిక న్యాయ జేయేసి కన్వీనర్ ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ ప్రారంభ సభకు ముఖ్య అతిథులుగా వస్తున్నారని బీసీ సంఘ నాయకులు తెలిపారు. జిల్లాలోని బీసీ వర్గాల వారందరిని ఐక్యపరిచి ఉద్యమాన్ని కొనసాగించడానికి బీసీ ఐక్యవేదిక పనిచేస్తున్నదని బిసి ఐక్యవేదిక సంఘం సభ్యులు తెలిపారు. బీసీల ఉమ్మడి సమస్యల సాధన కోసం గతంలో ఎన్నో పోరాటాలు చేపట్టామని, ఐక్యవేదికను మరింత బలోపేతం చేసుకొని, హక్కుల సాధన కోసం ఐక్యంగా ఉద్యమించడానికి ముందుకు రావాలని, జిల్లాలోని బహుజన బీసీ వర్గాల ప్రజలను ప్రజాస్వామిక వాదులను బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో కోరారు. కేంద్రప్రభుత్వం బీసి జనాభా లెక్కలను వెంటనే చేపట్టి, జనాభాకు అనుగుణంగా బీసి రిజర్వేషన్లు పెంచాలని, మండల్ కమీషన్ చేసిన అన్ని సిఫార్సులను అమలు చేయాలని వారు డిమాండు చేసారు. ఈ కార్యక్రమంలో బీసీ ఐక్య వేదిక కన్వీనర్ వడ్డెపల్లి మనోహర్, సామాజిక న్యాయవేదిక కన్వీనర్ రంగు రాజేశం, సీనియర్ బీసీ నాయకులు కనుకుంట్ల మల్లయ్య, అఖిల గాండ్ల తెలికుల సంఘం జిల్లా అధ్యక్షులు బుద్ధి చంద్రమౌళి, కురుమ సంఘం జిల్లా నాయకులు సమ్ము రాజన్న, బీసీ నాయకులు మొగిలి లక్ష్మణ్, సోమయ్య, భూమన్న, చిందం వెంకటేష్, ఆవునూరి పోచం తదితరులు పాల్గొన్నారు.