పోలీసులకి ఫిర్యాదు చేసిన తహసిల్దార్…
వీణవంక, జనవరి 1 ( తెలంగాణ ఎక్స్ ప్రెస్ ప్రతినిధి).
కరీంనగర్ జిల్లా వీణవంక మండల తహసిల్దార్ కార్యాలయంలో అధికారులు మాయాజాలం సృష్టిస్తున్నారని, ఎన్నిసార్లు మండల ప్రజలు మొత్తుకున్న పట్టించుకున్న పాపాన పోలేదు. చివరకు పాపం పండి నిజ నిజాలు బయటికి వచ్చాయి.తాజాగా తహసిల్దార్ కు తెలియకుండా, తన పాస్వర్డ్ కీ తో అక్రమంగా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ జారీచేసి పట్టుపడ్డ నాయబ్ తహసిల్దార్. విషయం తెలిసిన వెంటనే తహసిల్దార్ వెంటనే వీణవంక పోలీసులకు నాయబ్ తహసిల్దార్ పై ఫిర్యాదు చేయగా,డిసెంబర్ 30 తారీఖున కేసు నమోదు చేశారు. బేతిగల్ గ్రామానికి చెందిన ఓ కుటుంబంలో జరిగిన గొడవల నేపథ్యంలో తహసిల్దార్ ఆ ఫైల్ ను పెండింగ్ లో ఉంచగా, నవంబర్ 8 న డిప్యూటీ తహసిల్దార్, ధరణి ఆపరేటర్ తో కలిసి, తహసిల్దార్ తెలియకుండా పాస్వర్డ్ కీ ని వాడుకొని, తప్పుడు వివరాలతో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే తహసిల్దార్ తిరుమల్ రావు , జిల్లా కలెక్టర్ పమేల సత్పతి, హుజురాబాద్ ఆర్డీవో రాజు లకు ఫిర్యాదు చేస్తూ, ఇట్టి చర్యలలో పాల్గొన్న నాయబ్ తహసిల్దార్, ధరణి ఆపరేటర్ పై, అక్రమంగా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ పొందిన వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని, కఠినంగా శిక్షించాలని ఫిర్యాదు చేయడం జరిగింది.