కామారెడ్డి, డిసెంబర్ 6:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో)
అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి పౌరుడు కృషి చేయాలని
జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో బుధవారం ఎస్సి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి కలెక్టర్ జితేష్ వి పాటిల్ , అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అంటరానితనం రూపుమాపడానికి కృషి చేశారని కొనియాడారు. అన్ని వర్గాల ప్రజల కోసం ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారని చెప్పారు. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి పౌరుడు కృషి చేయాలని సూచించారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేశారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారిని రజిత, ఎస్సీ కార్పొరేషన్ ఈడి దయానంద్, డి ఆర్ డి ఓ సాయన్న, జిల్లా ఎస్సీ సహాయ సంక్షేమ అధికారి వెంకటేష్, జిల్లా వ్యవసాయ అధికారిని భాగ్యలక్ష్మి, టీఎన్జీవోఎస్ జిల్లా కార్యదర్శి సాయిలు, అధికారులు సాయి రెడ్డి, సంతోష్ కుమార్ పాల్గొన్నారు.