వచ్చే ఎన్నికల్లో గెలిచి నిలిచేది మనమేనని, డిసెంబరు మొదటి వారంలో ఇక్కడే విజయోత్సవసభ నిర్వహించుకుందామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
ఇప్పటివరకు తాము చేసిన అభివృద్ధి ట్రైలర్ మాత్రమేనని, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. పరిశ్రమల అనుమతులను సులభతరం చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని, నిరంతర విద్యుత్తుతో నేడు పారిశ్రామికవేత్తల ముఖాల్లో వెలుగులు నిండాయని పేర్కొన్నారు. తెలంగాణ ఇండస్ట్రియలిస్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. తొమ్మిదేండ్లలో ప్రభుత్వం సాధించిన విజయాలను వివరిస్తూనే, విపక్షాల విమర్శలను తిప్పికొట్టారు. మళ్లీ బీఆర్ఎస్సే రావాలని పారిశ్రామికవేత్తలే కోరుకోవడం తమకు గర్వకారణమని, వారికి ధన్యవాదాలు తెలిపారు.
ఈసారి కూడా విజయం తమదేనని కేటీఆర్ ధీమా వ్యక్తంచేశారు. డిసెంబర్ మొదటి వారం లో ఇదే హాలులో విజయోత్సవ సభను ఏర్పా టు చేస్తామని చెప్పారు. సమస్యలేవైనా ఉంటే అధికారంలోకి వచ్చాక పరిష్కరిస్తామని తెలిపారు. ఇప్పటికే చేపట్టిన పనుల్లో సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. సమస్యలపై ఆలస్యం చేయకుండా తనకు మెసేజ్ పెడితే సరిపోతుందని చెప్పారు.
ఈ భూమిపైకి అందరూ ఎక్స్పైరీ డేట్తోనే వస్తారు. పనికిమాలిన ఇగోలతో బతుకుతుంటారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. ఇందిరాగాంధీ, ఎన్టీ రామారావు వంటివారు కూడా ఎన్నికల్లో ఓడిపోయారు. మేం అంతకన్నా పెద్దవాళ్లం కాదు. ఎవరైనా ఎప్పుడో ఒకప్పుడు కుర్చీ దిగాల్సిందే. దీనికి ఫెవికాల్ కానీ, ఫెవిక్విక్ కానీ లేదు. ఐదేళ్లకోసారి వచ్చే పరీక్షలో పాస్ కావాల్సిందే.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఎన్నో అపోహలు ఉండేవని, కరెంటు ఉంటుందా? పెట్టుబడులు వస్తాయా? అసలు వీరికి పాలన చేతనవుతుందా? అని అనుమానాలు వ్యక్తం చేశారని కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. వాటన్నింటినీ పటాపంచలు చేశామని పేర్కొన్నారు. తొమ్మిదిన్నరేండ్లలో మొదటి 6 నెలలు కుదురుకోవడానికే సమయం పట్టిందని, కొవిడ్‌తో రెండేండ్లు పోయిందని చెప్పారు. మళ్లీ ఎన్నికలు రావడంతో నికరంగా ఆరేండ్లు మాత్రమే పనిచే సే అవకాశం వచ్చిందని చెప్పారు. 2014లో తాను పారిశ్రామికవేత్తలతో సమావేశం నిర్వహించి హైదరాబాద్‌లో భూముల ధరలు పడిపోవని, ఎవరూ భూములను అమ్ముకోవద్దని చెప్పినట్టు తెలిపారు.
రాష్ట్రం ఏర్పడిన కొత్తలో సీఎం కేసీఆర్ వివి ధ పారిశ్రామికవేత్తల సంఘాలతో 7 గంటలపాటు సుదీర్ఘ సమావేశం నిర్వహించిన అనంతరం అధికారులను పిలిచి సమయానికి అనుమతులు ఇస్తున్నారా? ప్రశ్నించారని, మౌలిక సదుపాయాలు, విద్యుత్తు సరఫరా తదితర అంశాలపై సీఎం అడిగిన ప్రశ్నలకు అధికారులు సరైన సమాధానం చెప్పకపోయారని గుర్తుచేశారు. అసలు అనుమతుల కోసం పారిశ్రామికవేత్తలు మన దగ్గరికి ఎందుకు రావాలి? అని ప్రశ్నించినా జవాబు ఇవ్వలేకపోయారని చెప్పారు. దీంతో అదేరోజు పరిశ్రమల అనుమతులకు టీఎస్ ఐపాస్ పేరుతో స్వీయ ధ్రువీకరణ విధానాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు.
50 వేల మంది మార్చ్చేసి ఆంధ్రావాళ్ల ఆస్తులన్నీ తీసుకుంటారట కదా. ఆంధ్రావాళ్లను తన్ని తరిమిమేస్తారట కదా.. నాకు వాట్సాప్‌లో మెసేజ్ వచ్చిందని మహిళా పారిశ్రామికవేత్త ఒకరు అప్పట్లో నన్ను అడిగారు. మాది స్టేట్ ఫైటే తప్ప స్ట్రీట్ ఫైట్ కాదని ఆమెకు చెప్పాను. ఎలాంటి పంచాయితీలు ఉండవని భరోసా ఇచ్చా.
- మంత్రి కేటీఆర్
గతంలో 10 గంటలు కరెంటు పోయినా అడిగేవారే కారని, ఇప్పుడు 10 నిమిషాలు పోతేనే ప్రజలు తట్టుకోలేక మెసేజ్‌లు పెడుతున్నారంటే 24 గంటల కరెంటుకు ఎంతలా అలవాటుపడ్డారో అర్థం చేసుకోవచ్చన్నారు. ఇది తాము సాధించిన విజయమని సంతోషం వ్యక్తంచేశారు. రాష్ట్ర ఏర్పాటు సమయంలో మన తలసరి ఆదాయం 1.14 లక్షలు. ఇప్పుడదని 3.17 లక్షలకు పెరిగిందని చెప్పా రు.
కుటుంబ పాలన విమర్శలపైనా స్పందించిన కేటీఆర్.. రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 3.17లక్షల కోట్లకు పెరిగిందని, ఈ లెక్కన చూస్తే తమ కుటుంబం ఒక్కటే బాగుపడినట్టా? అని ప్రశ్నించారు. కేసీఆర్‌ను తిడితే 4 ఓట్లు వస్తాయన్న ఆలోచన తప్ప విపక్షాలకు మరొకటి లేదని మండిపడ్డారు. ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయలేదు కాబట్టి బీజేపీతో తాము కలిసిపోయామ న్న విమర్శల్లో వాస్తవం లేదన్నారు. తాము ఎవరికీ బీ టీం కాదని, తెలంగాణ ప్రజలకు ఏ టీం అని స్పష్టంచేశారు. ‘రైతుబంధు’ను నాలుగైదు ఎకరాలకు పరిమితం చేసే విషయమై ఆలోచిస్తామని తెలిపారు. కాళేశ్వరంలో రూ. లక్షకోట్ల అవినీతి జరిగిందన్న రాహుల్‌గాంధీ ఆరోపణలు అర్థరహితమని కొట్టిపడేశారు. ఎన్డీయేలోనో, ‘ఇండియా’ కూటమిలోనో తాము ఉండాలని అనుకోవడం లేదన్నారు.
నేను దావోస్ వెళ్లినప్పుడు హోటల్లో మంచినీళ్ల బాటిల్ కావాలని అడిగితే బాత్రూంలో ట్యాప్ వాటర్ తీసుకుని తాగాలని చెప్పారు. అక్కడ వ్యర్థ జలాలను శుద్ధిచేసి తాగుతున్నారు. వాటికి అక్కడ జ్యూరిక్ వాటర్ అంటారు. మనకా బాధ లేదు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత విద్యుత్తురంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులు, ఇతర రాష్ర్టాల్లోని విద్యుత్తు రంగ దీనస్థితి పై విద్యుత్తుశాఖ ఏడీఈ తుల్జారాంసింగ్ ఠాకూర్ వివిధ పత్రికల్లో రాసిన విశ్లేషణాత్మక వ్యాసాలతో కూడిన సంకలనం ‘పవర్ఫుల్ తెలంగాణ’ను బుధవారం మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు.
రాష్ట్రంలో స్టేబుల్ గవర్నమెంట్.. ఏబుల్ లీడర్షిప్ ఉండడం వల్లే మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక తదితర రాష్ర్టాల నుంచి పెట్టుబడులు తరలివస్తున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ర్టాన్ని అప్పులపాలు చేశారని విపక్షాలు తరచూ ఆరోపిస్తున్నాయని, తాము అప్పులు తెచ్చి ఉత్పాదక రంగాలపై పెడుతున్నట్టు తెలిపారు. విద్యుత్తు సమస్య నివారణకు పవర్ ఇన్స్టాల్డ్ సామర్థ్యాన్ని 7 వేల మెగావాట్ల నుంచి 24 వేల మెగావాట్లకు పెంచేందుకు అతిపెద్ద పవర్ ప్రాజెక్టులను నిర్మిస్తున్నట్టు వివరించారు. ఇది అప్పుకాదని, ఉత్పాదక పెట్టుబడి కిందకు వస్తుందని తెలిపారు. అప్పులు అధికంగా ఉన్న రాష్ర్టాల జాబితాలో తెలంగాణ 23వ స్థానంలో ఉన్నదని చెప్పారు. మోదీ కన్నా ముందు పాలించిన 14మంది ప్రధానులు 56 లక్షల కోట్లు అప్పు చేస్తే, మోదీ ఒక్కరే 112 లక్షల కోట్లు అప్పు చేశారని గుర్తుచేశారు.