ఎల్లారెడ్డి, జులై 26,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
మణిపూర్ రాష్ట్రంలో ఆడవారిపై పైశాచిక అత్యాచారం చేసి మహిళల బట్టలు విప్పి రోడ్లపై తిప్పుతూ అడ్డు వచ్చిన వారిని కిరాతకంగా చంపి మారణకాండను సృష్టించిన దుండగులను కఠినంగా శిక్షించాలని కోరుతూ, బుధవారం ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో బీస్పీ( బహుజన్ సమాజ్ పార్టీ) నాయకులు డిమాండ్ చేశారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మణిపూర్ లో నివసించే మైతీలు, కుకీలు, నాగాలు మధ్య మొదలైన చిన్ని పాటి ఘర్షణను మత ఛాందసవాదులు రెచ్చగొట్టి భౌతిక దాడులకు, హింసలకు పాల్పడ్డారని మణిపూర్ లో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వ అండదండలతో ముగ్గురు మహిళల బట్టలు విప్పి రోడ్లపై ఊరేగించి మానభంగాలు చేసి ఘోరమైన దారుణాలకు పాల్పడ్డారు. మోడీ పాలనలో ఆదివాసి, గిరిజనులపై ఎస్సీ, ఎస్టీ, బిసి బహుజనులపై దాడులు చేయడం ఎంతో బాధాకరం అని, మణిపూర్ లో జరుగుతున్న హింసను బయటి ప్రపంచానికి తెలవకుండా ఉండడానికి ఇంటర్నెట్ సేవలను సెల్ ఫోన్ సిగ్నలను నిలిపివేశారంటే అక్కడి ప్రభుత్వం దాడులు చేసే వారిని ప్రోత్సహించిందని ప్రతి ఒక్కరికి అర్థం అవుతుందన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిపక్షాలన్నీ ఏకమై ప్రశ్నిస్తున్న మణిపూర్ గురించి ప్రధాని మాట్లాడకపోవడం ఏమిటని వారు ప్రశ్నించారు . దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని, మరణించిన వారి కుటుంబాలకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు. లేకుంటే బడుగు బలహీన వర్గాలు బహుజను లందరు ఏకమై బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నిరసనలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ ఎల్లారెడ్డి కమీటి అద్యక్షులు మర్లు సాయిబాబు, బాలకృష్ణయ్య, కిషన్, భూమేష్, పోచయ్య, బాలరాజు, భాను, కిషోర్, ప్రవీణ్, కిషన్ తదితరులు పాల్గొన్నారు